ప్రమాదం జరిగితే కానీ స్పందించరా..?
మండల పరిధిలోని బూదూరు నుంచి చిలకలడోనా మధ్య ఉండే రహదారి రోజు రోజుకు శిథిలావస్థకు చేరుతుండడంతో అటు నుంచి ప్రయాణించే బూదూరు గ్రామ ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

దిశ, మంత్రాలయం: మండల పరిధిలోని బూదూరు నుంచి చిలకలడోనా మధ్య ఉండే రహదారి రోజు రోజుకు శిథిలావస్థకు చేరుతుండడంతో అటు నుంచి ప్రయాణించే బూదూరు గ్రామ ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. గత వర్షాకాలంలో అధిక వర్షాల కారణంగా రోడ్డు పైకి నీరు వచ్చిపారినందున, మోరీల దగ్గర మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. అప్పటినుంచి ఇప్పటివరకు అధికారులు కానీ నాయకులు గానీ మట్టి వేసిన దాఖలాలు లేవు. ప్రమాదం జరిగితే తప్ప అధికారులు స్పందించరా? అని అటువైపుగా వెళ్లే ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే అధికారులకు ఈ గుంతలు కనపడటం లేదా అని ప్రయాణికులు అంటున్నారు. అంతేకాకుండా కొద్ది రోజుల్లోనే బూదూరు గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తారు. అయితే ఈ పండుగకి బెంగళూరు, హైదరాబాద్ అలాగే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన గ్రామస్తులు స్వగ్రామానికి తిరిగి వస్తుంటారు. మరి ముఖ్యంగా రాత్రి వేళలో కూడా ప్రయాణాలు చేస్తుంటారని రోడ్డు ఇలా ఉంటే ఎలా అని అంటున్నారు. అదేవిధంగా మునుపటితో పోల్చుకుంటే ఈ పండుగ జరిగే రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
మరి సాధారణ సమయాల్లోనే ఇబ్బందిని ఎదుర్కొన్న ప్రయాణికులు ఇలాంటి రద్దీ సమయాల్లో రోడ్డు ఈ విధంగా ఉంటే కచ్చితంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం లేకపోలేదు అని వాహనదారులు అంటున్నారు. చిలకలదోన గ్రామ దగ్గరలో కూడా ఇలాంటి గుంతలు పడితే వాటిని కొద్ది రోజుల తర్వాత పూడ్చి వేయడం జరిగింది. అయితే ఈ గుంతలు వాళ్లకి కనపడలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందనేది మాత్రం అర్థం అవుతుందని, ఏ ఒక్కరైన ప్రమాదానికి గురైతే మాత్రం బాధ్యత అధికారులదేనని ప్రయాణికులు వాపోతున్నారు.