బీఎస్ఎన్ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలేం లేవు: కేంద్రం!

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్).telugu latest news

Update: 2022-03-23 13:37 GMT

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికను అనుసరించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచారం శాఖ సహాయమంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌ లోక్‌సభలో మాట్లాడుతూ.. సంస్థ పునరుద్ధరణలో భాగంగా తెచ్చిన స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్)లో ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రస్తుతానికి సంస్థకు అవసరమైన స్థాయిలో సిబ్బంది ఉన్నారని చెప్పారు. సంస్థకు చెందిన భవనాలతో పాటు భూములు, టవర్లు, టెలికాం పరికరాలు, ఇంకా ఇతర పరికరాలు కలుపుకుని స్థిరాస్తుల విలువ గతేడాది మార్చి చివరి నాటికి రూ. 89,878 కోట్లుగా ఉందన్నారు.

ఇక, గతేడాది డిసెంబర్ 31 నాటికి బీఎస్ఎన్ఎల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ల వాటా 9.9 శాతంగా ఉందని, బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ల వాటా 15.4 శాతంగా ఉందని ఆయన వివరించారు. 2019, అక్టోబర్‌లో బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను కేంద్రం ఆమోదించింది. ఇందులో భాగంగా 50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు వీఆర్ఎస్ పథకాన్ని అమలు చేశారు. అలాగే, 4జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించారు. కొన్ని ఆస్తులను విక్రయించారు. రుణాల చెల్లింపు, మూలధన వ్యయం, ఇతర అవసరాలకు ప్రభుత్వ పూచి బాండ్ల నుంచి నిధులను సమీకరించినట్టు దేవుసిన్హ్‌ చౌహాన్‌ వెల్లడించారు. కాగా, ఎంటీఎన్ఎల్‌ను బీఎస్ఎన్ఎల్‌లో విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ బుధవారం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. విలీనానికి బదులుగా ఎంటీఎన్ఎల్ రూ. 26 వేల కోట్ల రుణాన్ని స్వాధీనం చేసుకుని, బీఎస్ఎన్ఎల్‌కి ఆర్థిక సహాయం అందించాలని సూచించింది.

Tags:    

Similar News