ట్రెండింగ్ అయ్యేందుకు వినూత్నంగా ఆలోచించిన యువత
దిశ, పెద్డపల్లి: ట్రెండింగ్‌కే ట్రెండ్ సెట్టర్లుగా మారిపోతున్నారు కొందరు. సరికొత్త ఆనవాయితీలకు తెర తీసిన
దిశ, పెద్డపల్లి: ట్రెండింగ్‌కే ట్రెండ్ సెట్టర్లుగా మారిపోతున్నారు కొందరు. సరికొత్త ఆనవాయితీలకు తెర తీసిన వారికి తామేం తీసిపోలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వీరు. ఈ సాంప్రాదాయాలు మీకేనా మాకేం ఉండవా ఇందుకు మేమేం తక్కువ తిన్నామా అనుకున్నారో ఏమో కానీ వీరు మాత్రం డిఫరెంట్‌గా ఆలో''చించేసి'' ఆచరణలో పెట్టేశారు కూడా. ఇటీవల కాలంలో ఆడపడుచులు, తోబుట్టువులకు కానుకలు ఇచ్చే ఆచారాం క్రియేట్ అయింది. చాలా మంది సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా తమ వారిని కలిసి మరీ ఈ పద్దతిని అవలంబిస్తున్నారు. దీనివల్ల నిన్న మొన్నటి వరకు సెల్ ఫోన్లో వీడియో కాల్ చేస్తూ సంబరపడ్డ వారంతా తమ వారిని వ్యక్తిగతంగా కలిస్తూ పాత అనుభూతులను నెమరువేసుకుంటున్నారు.
అయితే ఈ పద్ధతి ఎందుకు క్రియేట్ చేశారో కానీ పెనవేసుకున్న అనుబంధాలు మాత్రం రెన్యువల్ అవుతున్నాయన్నది వాస్తవం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా చక్కెర కుడుకలు అందించడం, అందుకు వారికి కానుకలు సమర్పించే పద్ధతి కొంతకాలం ఆరంభం అయింది. ఆ తర్వాత వదినలకు గాజులు, కుంకుమ, పువ్వులు పెడితే ఆడపడుచులకు చీరలు పెట్టి గౌరవించుకునే సాంప్రాదాయం నడిచింది.
ఇప్పుడిదే స్పెషల్..
ఇప్పటి వరకు మెట్టినింటికి వెళ్ళిన ఆడపడుచు, లేకపోతే తమ ఇంట్లో అడుగుపెట్టిన మహిళలతో మమేకమైన ఆచారాలను పాటించిన విధానాన్నే విన్నాం. కానీ ఇక్కడ మాత్రం సరికొత్త సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టారు. వినడానికి ఇబ్బందిగా ఉన్న వారు మాత్రం తాము అనుకున్న పద్దతిని అవలంబించి తీరుతున్నారు మరీ. ఇప్పుడంతా బావా, బామ్మర్దుల కలియక కార్యక్రమాన్ని ప్రారంభించారు. బావలను ఇంటికి పిలిచి నుదుట తిలకం దిద్ది నూతన వస్త్రాలు అందించి మద్యం బాటిళ్లను ఇచ్చే సంప్రాదాయానికి తెర తీశారు కొందరు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కూడా అవుతున్నాయి.
'' సారే దునియా ఏక్ తరఫ్ సాలే బౌనే ఏక్ తరఫ్'' అన్న సామెతను అక్షరాల నిజం చేస్తూ బావా బామ్మర్దుల కట్నాలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరి నోట ఔరా అనిపిస్తున్నారు. ఉగాది నాడు పెద్దపల్లి జిల్లాకు చెందిన శ్రీధర్, మహేష్, శ్రీకాంత్. విదేశాల నుంచి వచ్చిన వారి భావ దాస మల్లికార్జున్ (యు.ఎస్.ఎ) ఆశీర్వాదం పొందాలని ఈ వింత ఆచారాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొట్టేస్తుంది.
అయితే ఇదేదో గమ్మత్తుగా ఉందే అనుకుని బామ్మర్దులంతా బావాలను సంతోష పెట్టేందుకు వైన్ షాపుల వద్దకు పరిగెత్తితే రాష్ట్రానికి ఆదాయం ఫుల్లు అయ్యే అవకాశాలు ఉండగా, సగటు బామ్మర్దులు మాత్రం బావలను సంతోష పెట్టలేకపోయామే అన్న బాధకు కూడా లోనవుతారు. ఏది ఏమైనా అలనాటి ఆచారాలను ఆచరించే విధానానికి భిన్నంగా నేటి తరం డిఫరెంట్ గా ముందుకు సాగుతుండడంపై చర్చోప చర్చలు మాత్రం సాగుతున్నాయి.