కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎందుకింత ఖర్చు.. నెట్టింట మొదలైన చర్చ!

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని నిర్మించింది.

Update: 2022-03-10 12:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని నిర్మించింది. బ్రిడ్జి పూర్తవడంతో హైదరాబాద్ నగరానికి మరో ల్యాండ్ మార్క్‌గా నిలిచింది. అయితే, ఈ బ్రిడ్జిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.184 కోట్లను ఖర్చు పెట్టింది. మొత్తం 233 మీటర్ల పొడవున ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఇదంతా బాగానే ఉన్నా.. ప్రభుత్వం వెచ్చించిన మొత్తంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కేరళా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఆసియాలోనే అతిపొడవైన బౌస్ట్రింగ్ వంతెనను నిర్మించింది. 1.216 కిలో మీటర్ల పొడవైన ఈ బౌస్ట్రింగ్ బ్రిడ్జిని రూ.139.35 కోట్లు మాత్రమే ఖర్చు చేసి నిర్మాణాన్ని పూర్తి చేసి గురువారం సీఎం పినరయి విజయన్ ప్రారంభించారు. అయితే, దీని నిర్మాణానికి మొదట్లో రూ.146.50 కోట్లు మంజూరు చేసినా.. రూ.139.35 కోట్లలోనే పూర్తయినట్లు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయితే, కేరళ సీఎం ట్వీట్‌కు స్పందిస్తున్న నెటిజన్లు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో నిర్మించిన 233 మీటర్ల పొడవున్న కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు రూ.184 కోట్లు ఖర్చు చేశారని, ఈ క్రమంలో 1.5 మీటర్‌కు రూ. కోటి ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నిస్తూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, మీడియాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News