రేవంత్ రెడ్డికి పెను సవాల్.. రాజగోపాల్ రెడ్డి రూపంలో అగ్నిపరీక్ష
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయం పీక్స్ కు చేరుకుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాను
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయం పీక్స్ కు చేరుకుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాను పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. నిన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారా? లేదా? అనే అంచనాలు వేసుకున్న రాజకీయ పార్టీలు.. ఇప్పుడు ఉపఎన్నిక వస్తే మునుగోడులో గెలవబోయేది ఎవరనే దానిపై లెక్కలు వేసుకుంటున్నాయి. సిట్టింగ్ స్థానం కావడంతో ఫోకస్ అంతా కాంగ్రెస్ పైనే ఉంది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్.. ఇక్కడ గెలవకుంటే దాని పర్యవసానాలు పార్టీ భవిష్యత్ కు తీవ్రంగా మారే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైందనే చర్చ సాగుతోంది.
ప్రత్యామ్నాయంపై నజర్
ఇన్నాళ్లూ మునుగోడులో బలమైన నేతగా, పార్టీకి పట్టున్న వ్యక్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడటంతో ఆయన స్థానంలో ఎవరిని నిలబెట్టాలనేది కాంగ్రెస్ కు పెద్ద సవాల్ గా మారనుంది. ఈ వ్యవహారం అంతా ఆషామాషీ కాదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం బెడిసికొట్టక మానదనే చర్చ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డికి ధీటుగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పలువురి పేర్లను పరిశీలించి వారి బలాబలాలపై లెక్కలు కడుతోందట. కాంగ్రెస్ కు ఇలాంటి పరిస్థితి మునుగోడులోనే కాదు.. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఇలానే ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను పెద్ద సంఖ్యలో తమవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రణాళికలు వేస్తోందని, అందువల్ల ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై పార్టీలో ఆలోచన చేయాలనే సూచనలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నపలంగా నేతలు పార్టీని వీడితే తీరా ఎన్నికల సమయానికి అభ్యర్థుల విషయంలో పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఏం జరిగిందో పార్టీ అగ్రనేతలు ఓసారి నెమరు వేసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈటల టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరితే.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటాడని అంతా భావించిన పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. దీంతో ఇక్కడ హస్తం పార్టీది నామమాత్రపు ఫైటింగ్ గా మారిపోయిందనే విమర్శలు వచ్చాయి.
హెచ్చరించిన సునీల్ కనుగోలు
ఉప ఎన్నికలు వస్తే ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ నేతలు లేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ ఇప్పటికే నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు ముఖ్యమైన కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తున్న నేపథ్యంలో వారు పార్టీని వీడితే వారి స్థానంలో పోటీ చేసేందుకు బలమైన నేతలు లేరనేది ఆ నివేదికల సారాంశం. అందువల్ల ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్న స్థానాలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
రేవంత్ కు అగ్నిపరీక్ష
రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ ముప్పెట దాడికి దిగుతోంది. బుధవారం ఉదయం రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడగా.. ఆ వెంటనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో మునుగోడు అంశంలో బీజేపీ టార్గెట్ రేవంత్ రెడ్డిగా రాజకీయం చేయబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే సునీల్ కనుగోలు టీమ్ చెప్పినట్లుగా ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి పెడితే రేవంత్ రెడ్డి ఎవరిని ప్రోత్సహించనున్నారు..? ఆయన నిర్ణయంపై మిగతా వారు సంతృప్తితో ఉంటారా? లేక అసంతృప్తరాగం అందుకుంటారా? అనేది ప్రశ్నగా మారింది. దీంతో మునుగోడు నుండి మొదటలు పెడితే రాబోయే ఎన్నికల వరకు రేవంత్ రెడ్డికి వరుసగా అగ్నిపరీక్షలే అనే మాట రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలను రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారనేది కాలమే సమాధానం చెప్పనుంది.