మద్దతు ఇవ్వాల్సింది పోయి.. కడుపు మంట మాటలా!

Update: 2022-02-10 16:35 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణాకు అన్ని విధాలా మద్దతు ఇవ్వాల్సింది పోయి.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై ప్రధాని మోదీ తన కడుపు మంటను బయటపెట్టారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఆయన మాట్లాడారు.

ఎన్నో ఉద్యమాలు చేసి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకొన్న తెలంగాణ విషయంలో ఎనిమిదేళ్ల తర్వాత దేశ ప్రధాని రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు యావత్ తెలంగాణ ప్రజలు బాధపడ్డారన్నారు. లోక్ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరామన్నారు. కానీ వారు అవకాశం ఇవ్వలేదన్నారు.

ఒక పక్క బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రం పై వివక్ష చూపుతూ.. తెలంగాణ ప్రజల్ని కించపరచడమే కాకుండా రాష్ట్రాన్ని అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణకు న్యాయబద్ధంగా విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు.

అనంతరం తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్ సభ సెక్రటరీ జనరల్ కు నోటీసు ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు సభలోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో లోక్ సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.

Tags:    

Similar News