'పులుల మరణాల తగ్గింపునకు ఏం చర్యలు తీసుకున్నారు?'

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో పులుల మరణాలు పెరుగుతున్న తరుణంలో వాటి నివారణకు కేంద్ర..latest telugu news

Update: 2022-04-04 14:21 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో పులుల మరణాలు పెరుగుతున్న తరుణంలో వాటి నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఎంపీ ఆదాల అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అశ్వని కుమార్ చౌబే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2021 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 3 పులులు మరణించాయని ఇక దేశంలో అయితే 329 పులులు ప్రాణాలు కోల్పోయాయని కేంద్రమంత్రి అశ్వని కుమార్ చౌబే వెల్లడించారు.

ఇప్పుడు పులుల సగటు ఆయువు 10 నుంచి 12 సంవత్సరాలని, ఇవి వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత తగాదాలు, అధిక శిశు మరణాలు, విద్యుత్ ఘాతం, ఉచ్చులు, మునిగిపోవడం, రోడ్డు, రైలు ప్రమాదాల వల్ల దెబ్బలు మొదలైన అనేక అంశాలు పులుల మరణాల్లో ఉంటాయని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే వేట, మానవ- జంతు సంఘర్షణలతో పులుల మరణాలు తగ్గినట్లు స్పష్టం చేశారు. పులుల సంరక్షణకు భద్రతా ప్రణాళికను రూపొందించి, అమలు చేస్తున్నట్లు, పులుల మరణాలను అరికట్టేందుకు గాను అవగాహన కార్యక్రమాలు, ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందుకుగాను నిధులను కూడా కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్వని కుమార్ చౌబే చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News