జగ్గారెడ్డి దారెటు..? ఇరకాటంలో ఆయన సతీమణి

కాంగ్రెస్​పార్టీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎపిసోడ్​ కొత్త మలుపులు తిరుగుతోంది.

Update: 2022-03-22 12:08 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్​పార్టీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎపిసోడ్​ కొత్త మలుపులు తిరుగుతోంది. పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​బాధ్యతల నుంచి ఆయనను తప్పించడం, ఆయన రేవంత్​పైమరింత ఘాటుగా విమర్శలు చేయడం రాజకీయంగా హాట్​టాపిక్​గా మారింది. కాంగ్రెస్​పార్టీలోనే ఉండడానికి ఇష్టపడుతున్నానని చెప్పిన ఆయన.. తను ఏంటో చూపిస్తానని సవాల్​చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అసలు జగ్గారెడ్డి ఏం చేయనున్నారు..? తన అడుగులు ఎటువైపు పడనున్నాయనే అంశంపై కాంగ్రెస్​పార్టీలో తీవ్ర చర్చ కొనసాగుతోంది.మరోవైపు తాజా ఘటనలతో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం అయోమయంలో పడిపోయారు.

జగ్గారెడ్డి సతీమణి నిర్మల ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు జగ్గారెడ్డి వర్కింగ్​ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. జగ్గారెడ్డిని బాధ్యతల నుంచి తప్పిస్తే నిర్మల కూడా తప్పుకున్నట్లే లెక్కగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులపై రాజకీయంగా, మరో వైపు జిల్లా కాంగ్రెస్‌లో విస్త్రత చర్చ జరుగుతోంది. తాను కాంగ్రెస్‌ను వీడబోనని ఇటీవలే ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా మీడియా సమక్షంలో తిరిగి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తాను పార్టీలోనే ఉండాలనుకుంటున్నా ( వెళ్లగొడితే ఏం చేయలేం అనే అర్థం వచ్చేలా) అని జగ్గారెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కాంగ్రెస్​అధినేత్రి సోనియా, యువనేత రాహుల్​గాంధీని కలిసి వచ్చిన తరువాత పార్టీలోఉండాలో.. బయటకు పోవాలో నిర్ణయం తీసుకుంటానని ఇది వరకే ఆయన ప్రకటన చేశారు. అయితే ఢిల్లీలో వాళ్ల అపాయింట్​మెంట్​ లభించకపోవడంతో జగ్గారెడ్డి ఆ దిశగా ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇక తన సత్తా ఏమిటో నిరూపించడానికి సంగారెడ్డిలోని అంబేద్కర్​మైదానంలో లక్ష మందితో మార్చి 21న భారీ బహిరంగ సభ పెడతానని కూడా ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆ సభను వాయిదా వేసుకున్నారు. ఇంతలోనే ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ప్రస్తుతం జగ్గారెడ్డి పార్టీలో కార్యకర్తగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండగా రేవంత్​పై మరింత తీవ్ర స్థాయిలో ఘాటుగా విమర్శలు చేయడంతో అధిష్టానం జగ్గారెడ్డిపై మరింత కఠినంగా వ్యవహరించనున్నదా..? అనే కోణంలో కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. అధిష్టానం సీరియస్‌గా జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంటే ఆయన ఏ పార్టీలోకి వెళతారు..? జగ్గారెడ్డి పయనమెటు..? అనే అంశాలు ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జగ్గారెడ్డి ఎపిసోడ్‌లో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయో వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News