మృతుల కుటుంబాలకు రూ.లక్ష తక్షణ సాయం.. రూ.20 లక్షలివ్వాలని గండ్ర డిమాండ్
దిశ ప్రతినిధి, వరంగల్/ శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని మాందారిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
దిశ ప్రతినిధి, వరంగల్/ శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని మాందారిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే, రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితులను, వారి కుంటుంబ సభ్యులను పరామర్శించారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ కూడా బాధితులకు అందుతున్న వైద్యంపై ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని వారికి సూచించారు. అవసరమైతే నిమ్స్‌కు తరలిస్తామని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే, తమవంతుగా వ్యక్తిగత సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 25వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని వెల్లడించారు.
20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: గండ్ర సత్యనారాయణ డిమాండ్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కూలీల కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామంలోని వ్యవసాయ కూలీలు నలుగురు వ్యక్తులు చనిపోవడంతో పాటు మరో ఇద్దరి చేతులు తెగిపోయాయని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 20 లక్షలతో పాటు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్‌లో చదిపించే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. లారీ యజమానిపై చర్యలు తీసుకొని, ఇసుక క్వారీలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాయంపేట కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి, చిందం రవి, కట్టయ్య తదితరులు పాల్గొన్నారు.