తప్పిపోయిన బాలుడు.. 7 నెలల తర్వాత తల్లిదండ్రుల చేంతకు..
దిశ, మహబూబాబాద్ టౌన్: డోర్నకల్ రైల్వే స్టేషన్ లో గతేడాది ఆగస్టు 22న తప్పిపోయిన..Missing boy gets reunited with parents in Mahaboobabad
దిశ, మహబూబాబాద్ టౌన్: డోర్నకల్ రైల్వే స్టేషన్ లో గతేడాది ఆగస్టు 22న తప్పిపోయిన పదమూడేళ్ల బాబును గుర్తించిన జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ లైన్ సిబ్బంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ లోని దైవ కృప చిల్డ్రన్ హోమ్ లో రక్షణ కల్పించారు. బాబు అనారోగ్యంగా ఉండటంతో బాలల పరిరక్షణ అధికారి భానోత్ వీరన్న, దైవ కృప చిల్డ్రన్ హోమ్ బాణోత్ లోకేష్ లు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చికిత్స కోసం హైదరాబాద్ లోని నిలోఫర్, ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా మెదడులో నీరు రావటం వల్ల అనారోగ్యంతో ఉన్నాడని తెలిపారు. బాబు ఆరోగ్యం కోసం మెడిసిన్ వాడుతున్నాడు. అయితే, ఆధార్ కార్డ్ కోసం బాలుడు ఫింగర్ ప్రింట్స్ కోసం వేలు పెట్టడంతో అప్పటికే బాబు ఆధార్ కార్డు ఉండటంతో బాబు సాయికిరణ్ చిరునామా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం యాపాల గ్రామలోని నగావత్ తిరుపతి,లక్ష్మిల కుమారుడిగా గుర్తించారు. వెంటనే శుక్రవారం మహబూబాబాద్ బాలల సంరక్షణ అధికారి బొలగాని నరేష్ , మంచిర్యాల జిల్లా అధికారి సత్తయ్యకు సమాచారం అందించగా అంగన్వాడీ టీచర్ ద్వారా విషయం తల్లిదండ్రులకు తెలియజేశారు.
వెంటనే తల్లిదండ్రులు బాబును గుర్తించి, శనివారం ఉదయం లోపు మహబూబాబాద్ జిల్లా బాలరక్షా భవన్ కు చేరుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, బాలల సంరక్షణ అధికారులను కలిసి బాబు తప్పిపోయిన విషయం తెలియజేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ డా. నాగవాని, సభ్యుడు డేవిడ్ బాబు యొక్క ధృవపత్రాలను పరిశీలించి తల్లిదండ్రులకు అప్పిగించాలని నిర్ణయించారు. వెంటనే బాబును పిలిపించగా బాబు ఒక్కసారిగా తల్లిదండ్రులను చూడగానే గుర్తించి తండ్రి ఒడిలో చేరాడు. ఏడు నెలలుగా బాబు ఆచూకీ కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు బాబును చూడగానే ఒక్కసారిగా బోరున విలపించింది. బాబును తిరిగి కలుసుకోవటం చాలా సంతోషంగా వుందని, సహకరించిన మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, ప్రత్యేకించి బాబుకు 7 నెలలు సంరక్షణ కల్పించిన దైవ కృప చిల్డ్రన్ హోమ్ లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలతా లేనినా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డా. నాగవాణి, జిల్లా బాలల సంరక్షణ విభాగం అదికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలరక్షాభవన్ కో ఆర్డినేటర్ జ్యోతి, బాలల సంరక్షణ అధికారులు భానోత్ వీరన్న, బొలగాని నరేష్, సోషల్ వర్కర్ వెంకన్న, కౌన్సిలర్ రమేశ్ లు పాల్గొన్నారు.