లక్నో: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తుగా ఇవ్వాలని కోర్టు కోరింది. కింది కోర్టులు బెయిల్ విజ్ఞప్తులను తిరస్కరించడంతో, గత వారమై అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది అక్టోబరు 3న సాగుచట్టాలకు వ్యతిరేకంగా రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇది కాస్తా హింసాత్మకంగా మారడంతో కోపంతో రైతులు దాడికి దిగారు. ఈ ఘటనలో 8 మందితో పాటు ఓ జర్నలిస్టు మరణించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు చార్జ్ షీటు కోర్టుకు సమర్పించారు. విచారణలో మృతదేహాలపై ఎలాంటి కాల్పుల తాలూకు గాయాలు లేవని పేర్కొంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆశిష్ కు గతవారమే బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఈ నెల 23న లఖింపూర్‌లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.