బతుకమ్మ పండుగ వేళ మంత్రి సీతక్క కీలక పిలుపు

బ‌తుకమ్మ అంటే పూల పండుగ‌. ప్రకృతి పండుగ‌. తెలంగాణ సంస్కృతి సాంప్ర‌దాయాల‌కు అద్దం ప‌ట్టే ఒక వేడుక.

Update: 2024-10-08 16:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బ‌తుకమ్మ అంటే పూల పండుగ‌. ప్రకృతి పండుగ‌. తెలంగాణ సంస్కృతి సాంప్ర‌దాయాల‌కు అద్దం ప‌ట్టే ఒక వేడుక. బ‌తుక‌మ్మ పండ‌గ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హిస్తుంది. స‌చివాల‌యం మొద‌లుకుని మారుమూల ప‌ల్లెల‌ వ‌ర‌కు స‌క‌ల జ‌నులు సామూహికంగా బ‌తుక‌మ్మ ఆడుతున్నారు. అయితే బ‌తుక‌మ్మ పండ‌గను కేవలం సాంస్కృతిక వేడుక‌కే ప‌రిమితం చేయ‌కుండా.. పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ధి మ‌రియు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క చెరువుల‌ను కాపాడాల‌నే గొప్ప సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్నారు. గ‌తంలో మాదిరిగా కృత్రిమంగా కాకుండా బ‌తుకమ్మ పండుగ స‌హ‌జ‌త్వాన్ని పున‌రుద్ద‌రిస్తూ చెరువుల ప్ర‌ధాన్య‌త‌ను, వాటిని కాపాడుకోవాల్సిన అవ‌స‌రాన్ని మంత్రి సీతక్క వివ‌రిస్తున్నారు.

చిన్నా, పెద్దా, హోదా అంత‌స్తు అన్న తేడా లేకుండా మంత్రిగా బాధ్యతలు నిర్వ‌హిస్తూనే, అధికార కార్య‌క్ర‌మాల్లో పాల్గోంటూనే, అధికారుల‌తో స‌మీక్ష‌లు చేప‌డుతూనే.. వీలైనన్ని చోట్ల బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు హ‌జ‌ర‌వుతున్నారు. మ‌హిళ‌ల‌తో క‌ల‌సి బ‌తుక‌మ్మ పాటలు పాడుతూ బ‌తుక‌మ్మ ఆడుతున్నారు. దీంతో పాటు చెరువులు, జ‌ల‌శ‌యాల ప్ర‌ధాన్య‌త‌ను, వాటి ప‌రీర‌క్ష‌ణ సందేశాన్ని ఒక యజ్ఞంలా ప్ర‌జ‌ల్లోకి తీసుకేల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తెలంగాణ‌కు, చెరువుల‌కు ఉన్న బంధాన్ని వివ‌రిస్తూ.. చెరువులు లేక‌పోతే మ‌నం లేము అన్న సందేశాన్ని వినిపిస్తున్నారు. చెరువులకు పూజలు చేసే పండుగ బతుకమ్మ.. అందుకే చెరువులను కబ్జాలు కాకుండా కాపాడుకుందామని పిలుపునిస్తున్నారు. తెలంగాణ అంటేనే చెరువులు.. తెలంగాణ జీవ‌న రేఖ చెరువులు. మన జీవన శైలి చెరువులపై ఆధారపడి ఉంది.. మ‌న మ‌నుగుడ చెరువుల‌తో ముడి ప‌డి ఉంద‌నే సందేశాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తున్నారు. చెరువులకు ఆడ బిడ్డలంతా ధన్యవాదాలు తెలిపే పండుగ బతుకమ్మ.. కాబ‌ట్టి చెరువుల‌ను ర‌క్షించుకుందాం అని బ‌తుక‌మ్మ వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న సీత‌క్క‌ క‌ల్పిస్తున్నారు.


Similar News