దమ్ముంటే గంగులపై పోటీ చెయ్.. బండికి కేటీఆర్ సవాల్
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కి రాష్ట్ర మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కి రాష్ట్ర మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలా ఎంపీగా గెల్చిన సంజయ్ దమ్ముంటే ఈ సారి గంగుల కమలాకర్ పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. గురువారం కరీంనగర్లో పర్యటించిన ఆయన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశాడో చెప్పాలని, గెలిచి మూడేళ్ళు అవుతున్నా మూడు కోట్ల పని అయినా చేసిండా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వాలని ఒక్కసారైనా అడిగాడా..? కరీంనగర్ కు ఒక్క కాలేజీ అయినా తీసుకువచ్చావా అని నిలదీశారు.
డబ్బాలో రాళ్ళు వేసి ఊపినట్టు రోజూ హిందు ముస్లింల లొల్లే తప్ప తన పార్లమెంటు పరిధిలోని ఒక్క అసెంబ్లీకి ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. మూడేళ్ళలో ఏం పీకినవు బండి సంజయ్, పిల్లగాళ్ళని చెడగొట్టుడు, మత పిచ్చి లేపుడే నీ పని అంటూ దుయ్యబట్టారు. వారిలో విషం నింపుడు, విషం చిమ్ముడే పనిగా పెట్టుకున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్న బండి సంజయ్, కరీంనగర్లో నీవు, మోడీ డబుల్ ఇంజన్లే కదా ఏం చేశారో చెప్పాలన్నారు. తాను కరీంనగర్ మిషన్ ఆసుపత్రిలో పుట్టి సెయింట్ జోసేప్ పాఠశాలలో చదువుకున్నానని కరీంనగర్‌తో ఎనలేని అనుబంధం ఉందన్నారు. కరీంనగర్ తమకు లక్ష్మీ నగర్ లాంటిదన్నారు. ఇక్కడి నుండి ఏ పని మొదలు పెట్టినా విజయవంతం అవుతోందన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 10 రెట్లు పింఛన్ పెరిగిందనిని, రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గాయని, మెడికల్ కాలేజీ కరీంనగర్‌కు రాబోతుందన్నారు. ఇంటింటికీ నల్లా నీళ్ళు ఇస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణేనని, ఈసారి మహిళలు మానేరు రివర్ ఫ్రంట్ దగ్గరే బతుకమ్మ ఆడుకొవాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కరీంనగర్లో ఒక్క రోజే వెయ్యి కోట్లకు పైగా పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.