'ఆకులు రాలుతున్నాయి' పుస్తకావిష్కరణ చేసిన మంత్రి హరీష్ రావు

Update: 2022-02-15 11:16 GMT

దిశ, సిద్దిపేట: సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మరసం ఆధ్వర్యంలో ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు కొమురవెల్లి అంజయ్య రచించిన 'ఆకులు రాలుతున్నాయి' కవితా సంపుటిని మంత్రి హరీశ్ రావు సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా సృష్టించిన జీవన విధ్వంసాన్ని కవిత్వం ద్వారా వెలువరించిన సీనియర్ జర్నలిస్ట్ కవి కొమురవెల్లి అంజయ్య అభినందనీయులని మంత్రి హరీష్ రావు అన్నారు. కరోనా వ్యాధి సృష్టించిన విధ్వంసం మానవ సమాజాన్ని అతలాకుతలం చేసిందన్నారు.

మనిషికి మనిషి శత్రువుగా మారిన ఆ సందర్భాలను గుర్తు చేసుకుంటే గుండె తరుక్కు పోతుందన్నారు. ఆకస్మికంగా, ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా వలస కూలీలు పడ్డ అవస్థలు వర్ణనాతీతమని చెప్పారు. మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్ళడానికి వేలాది కిలోమీటర్లు కాలినడకన బయలుదేరి వెళ్లిన సంఘటనలు ఎంతో బాధ కలిగించాయని చెప్పారు.




కరోనా వ్యాధి మానవ సమాజానికి పెద్ద గుణపాఠం నేర్పిందని తెలిపారు. తోటి మానవుల పట్ల ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పిందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్స చేయలేక చేతులెత్తేస్తే గాంధీ ఆస్పత్రి అందించిన సేవలను కొమురవెల్లి అంజయ్య తన కవిత్వంలో వివరించారని చెప్పారు. కరోనా సమయంలో మనుషులు ఎంత అమానవీయంగా ప్రవర్తించారో, అంత మానవీయంగా స్పందించి ఆదుకున్న ఘటనలను వివరించారు.

ప్రపంచమంతా కరోనా వ్యాధి ముందు మోకరిల్లిందని చెప్పారు. అగ్ర రాజ్యం అమెరికా దేశం కూడా విలవిలలాడిన తీరును వివరించారు. కరోనా వ్యాధి నివారణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి సరిగా లేదని హరీష్ రావు విమర్శించారు. అలాంటి కారణాల అనుభవాలను పుస్తక రూపంలో భవిష్యత్ తరాలకు గుర్తు చేయడానికి అంజయ్య ఎంతో కృషి చేశారని కొనియాడారు.

వలస కార్మికులను రాష్ట్రాల నుంచి రైళ్లలో, బస్సులో తమ తమ ప్రాంతాలకు పంపించడం వల్లనే కరోనా దేశవ్యాప్తంగా ప్రబలిందని ప్రధానమంత్రి పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహితమని అన్నారు. కరోనా సృష్టించిన జీవన విధ్వంసాన్ని కవి కొమురవెల్లి అంజయ్య తన కవిత్వంలో గొప్పగా చిత్రీకరించారని, అనేక సంఘటనలను, అమానవీయ చర్యలను కవిత్వం ద్వారా రికార్డు చేశారని తెలిపారు. ఈ కవితా సంపుటి చరిత్రలో నిలిచి ఉంటుందని చెప్పారు.

ప్రఖ్యాత కవి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. కవి కొమరవెల్లి అంజయ్య తాను ఇద్దరం మంచి మిత్రులమని చెప్పారు. ఇద్దరం కలిసి చదివామని కలిసి కవిత్వం రాశామన్నారు. అంజయ్య ఒకవైపు కవిగా, మరోవైపు జర్నలిస్టుగా సమాజం పట్ల తన బాధ్యతను గొప్పగా నిర్వర్తించారని చెప్పారు. కరోనా నేపథ్యంలో తాను 'అనిమేష' కవితా సంపుటి వెలువరించగా, 'ఆకులు రాలుతున్నాయి' అనే కవితా సంపుటి వెలూవరించడం యాదృచ్ఛికమేనని అన్నారు. సాహిత్యంలో కరోనాపై మంజీరా రచయితల సంఘం తరఫున రెండు కవితా సంపుటిలు వెలువడటం, ఆ రెండు సిద్దిపేటకు చెందిన కవులవే కావడం గొప్ప విషయమని చెప్పారు.

ప్రముఖ గాయకుడు, కవి ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రాంతంలో జర్నలిస్టుగా, కవిగా కొమరవెల్లి అంజయ్య సమాజంపై ఎంతో ప్రభావం చూపాడని చెప్పారు. అనేక మంది కవులు, జర్నలిస్టులకు అంజయ్య కార్యాలయం కూడలిగా ఉండి ప్రేరణనిచ్చిందన్నారు. కరోనా వ్యాధి నేపథ్యంలో అంజయ్య వెలువరించిన 'ఆకులు రాలుతున్నాయి' కవితా సంపుటిలో అనేక సంఘటనలు రికార్డ్ అయ్యాయని చెప్పారు. మానవుడు చేసిన ప్రకృతి విధ్వంసం వల్లనే కరోనా వచ్చిందని తెలిపారు. మనిషి ప్రకృతిపై చేస్తున్న యుద్ధమే కరోనా వ్యాధిగా పరిణమించిందని తెలిపారు. మానవుడు తనని తాను అందరికంటే గొప్పవాడినని విర్రవీగుతున్న భావనలు కరోనా ముందు ఓడిపోయాయని చెప్పారు. ప్రపంచాన్ని తన ఆధిపత్యం ద్వారా ఓడించాలని చూసిన అమెరికా లాంటి దేశాలు సైతం కరోనా ముందు ఓడిపోక తప్పలేదని చెప్పారు. కవి నిత్య చలనశీలం గా ఉన్నప్పుడు, సమాజంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించి స్పందించినప్పుడు మాత్రమే మంచి కవిత్వం వస్తుందని చెప్పారు.

బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ.. మంజీరా రచయితల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంగా గొప్ప సామాజిక సాహిత్య కృషి చేసిందని చెప్పారు. అనేక సామాజిక సమస్యలపై మరసం కవులు తమ కలాన్ని, గళాన్ని వినిపించారని చెప్పారు. అందులో భాగంగానే కొమరవెల్లి అంజయ్య కరోనా వ్యాధి నేపథ్యంలో రాసిన కవితల సంపుటి 'ఆకులు రాలుతున్నాయి' వెలువరించారని చెప్పారు. ఈ సభకు మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు కె. రంగాచారి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి కొమురవెల్లి అంజయ్య, తెరసం గౌరవాధ్యక్షుడు తోట అశోక్, మరసం ప్రధాన కార్యదర్శి సిద్దెంకి యాదగిరి, నందిని భగవాన్ రెడ్డి, జై హింద్, శిల్పి రమణారెడ్డి, నక్షత్రం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News