మంత్రి హరీష్ రావు నోటి వెంట బూతులు.. పీయూష్ గోయల్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్
‘ధాన్యం ఎగుమతులకు, కొనుగోళ్లకు డబ్ల్యూటీఓ నిబంధనలు అడ్డంకి ఉంటే నువ్వేం పీకుతున్నావ్...
దిశ, తెలంగాణ బ్యూరో : 'ధాన్యం ఎగుమతులకు, కొనుగోళ్లకు డబ్ల్యూటీఓ నిబంధనలు అడ్డంకి ఉంటే నువ్వేం పీకుతున్నావ్... 8 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు మార్చలేదు' అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఒప్పందాలు రాష్ట్రం మార్చుతుందా? రైతులు మార్చుతరా? దేశమంతా తిరిగిండు కదా ప్రధాని... ఆ ఒప్పందాలు మార్చమనండి... రైతులను ఆదుకోమనండి... కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఎప్పుడు చూసినా బెదిరింపు ధోరణి, అహంకార పూరితంగా మాట్లాడతున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాజ్యసభలో పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బేషరత్తుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సురేందర్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరం అయితే నూకలు తింటం.. కేంద్రాన్ని గద్దె దించుతామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరోసారి తెలంగాణ రైతులను ప్రజలను పార్లమెంటు సాక్షిగా అవమానించారన్నారు. మమ్మల్ని అంటే ఏమైనా భరిస్తాం కానీ తెలంగాణ రైతులనంటే పడేది లేదని హెచ్చరించారు. నూకలు తినాలని మా మంత్రులు, ఎంపీలతో హేళనగా మాట్లాడిన పీయూష్ ఇప్పుడు మరోసారి అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు.
ఆడిటర్ గా పని చేసిన పీయూష్ కు రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయన్నారు. తెలంగాణకు వస్తే పీయూష్ గోయల్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకేమి చేస్తుందో తెలుస్తుందన్నారు. వ్యాపారి లా మాట్లాడటం సరి కాదని హితవు పలికారు. ధమ్కీలు ఇచ్చే సంస్కృతి బీజేపీదని, తెలంగాణ రైతుల కోసం అడిగితే ధమ్కీ అంటావా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం పోయి వ్యయాన్ని రెట్టింపు చేశారని కేంద్రంపై మండిపడ్డారు.
తెలంగాణలో ఆపిల్స్ పండించమని కశ్మీర్లో వరి పండించాలని అంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. బీజేపీది ఎవరి పక్షమో చెప్పాలని డిమాండ్ చేశారు. పీయూష్ కార్పొరేట్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బ్యాంకులకు ఎగ్గొట్టిన కార్పొరేట్లకు 11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు.. తెలంగాణ రైతుల కోసం కొంత మొత్తాన్ని కేటాయించ లేరా అని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేసినట్టే బాయిల్డ్ రైస్ ఒప్పందాన్ని రద్దు చేసుకోలేరా? అన్నారు. వడ్లు కొనకుంటే తెలంగాణ రైతుల కోపాగ్నికి బీజేపీ బలి కాక తప్పదని హెచ్చరించారు.
వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు పెట్టుకుంటే ఏడాదికి ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రంఆఫర్ చేసినా రైతుల కోసం కేసీఆర్ తిరస్కరించారనే విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ కార్పొరేట్ల పార్టీ కాదు.. ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ.. ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ టీఆర్ఎస్ అన్నారు. మాకు అవమానాలు కొత్త కాదు అన్నిటినీ ఎదుర్కొంటాం. రైతుల పక్షాన ఉంటామని స్పష్టం చేశారు. రైతులంటేనే బీజేపీకి కడుపుమంట అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కేంద్రం బేషరతుగా తెలంగాణ రైతులు వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రైతుల అకౌంట్లలోకి నేరుగా కేంద్రం డబ్బులు వేస్తామన్నది అబద్ధం అన్నారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఈ నెల 2 తర్వాత ధాన్యం సేకరణ పై కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నిరసనలు ఆందోళనలు చేస్తాం.. కేంద్రం మెడలు వంచుతాం... ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామని స్పష్టం చేశారు.