ఆడబిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం"రుతు ప్రేమ".. రుతు స్రావంపై మంత్రి అవగాహన సదస్సు

దిశ , సిద్దిపేట : ఆడబిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం నూతనంగా సిద్దిపేటలో రుతు ప్రేమ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఆర్థిక వైద్య

Update: 2022-04-06 10:21 GMT

దిశ , సిద్దిపేట : ఆడబిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం నూతనంగా సిద్దిపేటలో రుతు ప్రేమ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ఐదో వార్డులో మహిళలకు శానిటరీ కప్స్, బట్ట డైపర్‌లు, ప్యాడ్‌లు ఉచిత పంపిణీ కార్యక్రమం ప్రయోగాత్మకంగా చేపట్టి మహిళలు, బాలికలకు ఋతు స్రావ రుతు ప్రేమ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లగా పుట్టిన ప్రతి వారికి ప్రతి నెలా రుతుస్రావం (బహిష్టు) అనేది ఓ సహజ ప్రక్రియ. అది ప్రకృతి ధర్మం అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం మహిళ ఆరోగ్యం, డబ్బుల ఆదా, పర్యావరణ పరిరక్షణకు సరికొత్త ప్రక్రియ అని ఇది మరో మార్పుకు నాంది కావాలన్నారు.

రాష్ట్రంలో తొలి ప్రక్రియగా సిద్దిపేటలో మొదలైన రుతు ప్రేమ ఇక్కడితో ఆగకూడదని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, దేశానికే మనమే ఆదర్శంగా ఉండాలన్నారు. రుతు ప్రేమ పేరిట ప్రతి మహిళకు క్లాత్ ప్యాడ్స్, పిల్లలకు బేబీ క్లాత్ డైపర్స్ పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. రసాయనిక డైపర్స్ వాడకం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారని , క్లాత్ ప్యాడ్స్ వాడటంలో సిద్దిపేట దేశానికి, ప్రపంచానికి మార్గదర్శకం కావాలన్నారు.

ఈ కంప్యూటర్ యుగంలో.. ఇతర గ్రహాలకు ఉపగ్రహాలను పంపుతున్న నేటి కాలంలో కూడా ఆడ పిల్లలు దీని గురించి బహిరంగంగా మాట్లాడరని, తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించరని మంత్రి అన్నారు. మహిళల్లో సహజంగా జరిగే రుతుస్రావం ప్రక్రియ గురించి బహిరంగంగా మాట్లాడక పోవడం వల్ల ఇప్పటికే సమాజం అనేక విధాలుగా నష్ట పోయిందన్నారు. సమాజంలో బాధ్యతాయుత పౌరుడిగా అభయం అందించి అండగా ఉండాలని భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.


రుతు ప్రేమ కార్యక్రమం వల్ల ప్రస్తుతం దానిపై బహిరంగంగా చర్చ, చైతన్య ప్రక్రియ జరగడం తొలి విజయంగా అభివర్ణించారు. ఇదే స్ఫూర్తితో మహిళా సంఘాలు, వైద్యులు ప్రజలను మరింత చైతన్యం చేయాలని, క్లాత్ ప్యాడ్స్ వినియోగం గూర్చి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా 35 కోట్ల మహిళలు రసాయనిక ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడుతునట్టు సర్వేలో తేలిందన్నారు. మహిళల ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాలన్నారు. ప్లాస్టిక్ ప్యాడ్స్ స్థానంలో క్లాత్ ప్యాడ్స్ వాడటంలో బహుశా రాష్ట్రంలో సిద్దిపేట మొదటిదని, రానున్న రోజుల్లో అన్ని వార్డుల్లో క్లాత్ ప్యాడ్స్ పంపిణీ చేస్తామన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగుల, మెప్మా, మహిళ కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని, వారికి అవగాహన కల్పించాలని మంత్రి హరీష్ రావు అక్కడే ఉన్న అదనపు కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లకు సూచించారు.

మహిళా అభ్యుదయం: జిల్లా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు సహజంగా ఎదుర్కొంటున్న సమస్య పీరియడ్స్ అని అలాంటి పీరియడ్స్ ప్రధాన అజెండా అంశంగా సదస్సు జరగడం మహిళా అభ్యుదయానికి ప్రతీక అని జిల్లా పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో పీరియడ్స్ అంశం మూడో కంటికి తెలియకుండా ఆడవారు జాగ్రత్తలు పాటించేవారన్నారు. చివరికి సొంత అన్నదమ్ముల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండేవారని అలాంటిది నేడు ఒక మార్పు కోసం సదస్సు ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. సిద్దిపేటలో చర్చ చైతన్యం స్ఫూర్తిదాయక అన్నారు. నేడు వందల మంది మహిళలు కూర్చొని చర్చ చేయడం గొప్ప విషయం అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రుతు స్రావ అలవాట్లు మార్చుకోవాలని కోరారు.

ప్లాస్టిక్ ప్యాడ్స్ స్థానంలో క్లాత్ ప్యాడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. మార్పుకు సిద్ధిపేట నాంది కావాలని ఆకాంక్షించారు. ఇది జిల్లా వ్యాప్తంగా జరగాలన్నారు మార్పు కోసం ప్రతి మహిళ నడుము బిగించాలన్నారు. మహిళ ఆరోగ్యం గూర్చి ఆమె ఆలోచన చేయాలని సూచించారు. రుతు స్రావం అనేది అనారోగ్యం కాదని సృష్టికి మూలమన్నారు. పీరియడ్స్ అంశంపై ప్రతి ఇంటిలో టాపిక్ రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు గాయత్రి దేవి, రమాదేవిలు ప్రసంగించారు.

Tags:    

Similar News