పునాది దాటని నమూనా ఇళ్లు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గ్రామాల్లో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి.

దిశ, ఏన్కూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గ్రామాల్లో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ఏ విధంగా జరపాలి, ఆ ఇల్లు నిర్మాణం జరిగిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని లబ్ధిదారులకు అవగాహన కలిగేందుకు జిల్లా కలెక్టర్ ముజాముల్ ఖాన్ ప్రత్యేక చొరవతో మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వెనక ఇందిరమ్మ నమూనా ఇల్లు నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఆ ఇల్లు ద్వారా లబ్ధిదారులుగా అవగాహన కల్పించాలని సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారులకు బాధ్యత అప్పగించారు. ఆ నమూనా ఇల్లు పునాదుల్లోనే పురుడు పోసుకుంది.
ఏనుకూరు మండలం రేపల్లెవాడ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇందిరమ్మ నమూనా ఇల్లు నిర్మాణం కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఆ ఇల్లు నిర్మాణం పూర్తిగా కాకపోవడం వల్ల లబ్ధిదారులు అయోమయంలో పడుతున్నారు. లబ్ధిదారులకు ఏమైనా సందేహాలు వస్తే నమూనా ఇల్లు చూపించాలంటే అవి పూర్తి చేయకుండా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని లబ్ధిదారులు విసుగు చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఇందిరమ్మ నమూనా ఇల్లు పూర్తి చేసే విధంగా సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చి ఇందిరమ్మ నమూనా ఇల్లు పూర్తిచేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ నమూనా ఇల్లు పూర్తి చేసే విధంగా సంబంధిత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు ఇచ్చి పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు.
ఈ విషయంపై పంచాయతీరాజ్ డీఈని వివరణ కోరగా పాలేరు, ఖమ్మం రూరల్, కొనిజర్ల మండలాల్లో, నామునా ఇల్లు నిర్మాణం జరిపి వారు సెంట్రింగ్ లు పెడుతున్నారని, వారు వస్తే ఇక్కడ నిర్మాణం జరుగుతుంది అన్నారు.