చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచాడు: మంత్రి బొత్స సత్యనారాయణ

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ - Minister Botsa Satyanarayana was highly critical of Chandrababu

Update: 2022-03-30 16:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కొన్నారని ఆరోపించారు. టీడీపీ చంద్రబాబు పార్టీ కాదని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దివంగత సీఎం ఎన్టీఆర్ ఎన్నో గొప్ప సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం వాటన్నింటిని పక్కన పెట్టి కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు విధానాల వల్లే తెలుగుదేశం పార్టీ జవసత్వాలు కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారనేది వాస్తవం కాదా అని బొత్స ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్, ఎయిర్‌పోర్ట్ నిర్మించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని బొత్స గుర్తుచేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్‌పై ఎవరి పేరుందో ఒకసారి చూడాలంటూ ధ్వజమెత్తారు. జలయజ్ఞం కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించారని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రింగ్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జలయజ్ఞం వంటి గొప్ప కార్యక్రమాలు చంద్రబాబు చేస్తే 2019 ఎన్నికల్లో ఆయన కొడుకు లోకేశ్ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. ప్రజలకి తగిన అవసరాల్ని గుర్తు పెట్టుకుని చేసే నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌లు అని చెప్పుకొచ్చారు. అమరావతి భూముల దోపిడీ చంద్రబాబు బంధువుల కోసం కాదా అని నిలదీశారు. టీడీపీ ఎంత హడావిడి చేసినా ఆ పార్టీకి జవసత్వాలు లేవని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఒక విధానం లేదని కానీ వైసీపీకి ఒక ఆలోచన ఉందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

జగన్ నిర్ణయమే శిరోధార్యం..

ఇకపోతే మంత్రివర్గ విస్తరణపైనా మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. కేబినెట్‌పై నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పుకొచ్చారు. మంత్రివర్గ కూర్పు అంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయని గుర్తు చేశారు. పార్టీ తల్లి లాంటిదని.. అందరం కలిసికట్టుగా ఉంటామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ మాట చెబితే దానికి కట్టుబడి ఉంటామని అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Tags:    

Similar News