ప్రపంచ పురాతన వృక్షాలను క్లోన్ చేస్తున్న యువకుడు!
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని అత్యంత పురాతన, భారీ వృక్షాలను క్లోన్ చేస్తున్న అమెరికన్ వ్యక్తి మానవాళిని సంరక్షించే లక్ష్యంతో పనిచేస్తున్నాడు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని అత్యంత పురాతన, భారీ వృక్షాలను క్లోన్ చేస్తున్న అమెరికన్ వ్యక్తి మానవాళిని సంరక్షించే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడైన డేవిడ్ మిలార్చ్ 1994లో 'ఆర్చ్ఏంజెల్ ఏన్షియంట్ ట్రీ ఆర్కైవ్' పేరుతో ఎన్‌జీవో ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ఇప్పటివరకు జెయింట్ సీక్వోయాస్, రెడ్‌వుడ్స్ వంటి అనేక పురాతన వృక్షాలను క్లోన్ చేసింది.
పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో అడవులు తగ్గిపోయి వాతావరణ మార్పులు సంభవిస్తు్న్నాయి. ఈ పరిస్థితిని నిరోధించేందుకు పురాతన చెట్లను కాపాడుతూ భూగ్రహాన్ని తిరిగి అడవులతో నింపేందుకు 'ఆర్చ్ఏంజెల్ ఏన్షియంట్ ట్రీ ఆర్కైవ్' శ్రమిస్తోంది. ఈ సంస్థ వలంటీర్లు.. పురాతన చెట్ల జన్యుశాస్త్రాన్ని అధ్యయనం చేయడంతో పాటు ఆయా వృక్షాలను క్లోనింగ్ చేసి వాటిని స్థానిక అడవుల్లో తిరిగి నాటుతారు.
వాతావరణ మార్పులతో పోరాడుతోంది!
సీక్వోయా జాతి వృక్షాల్లో భూమిపై అతిపెద్దది 'జనరల్ షెర్మాన్'. ఒక వ్యక్తి 86 ఏళ్ల కాలంలో విడుదలచేసే కార్బన్ ఉద్గారాలను కేవలం ఈ ఒక్క చెట్టు నిల్వ చేయగలదని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ పురాతన చెట్లు సగటు కంటే పది రెట్లు ఎక్కువ CO2ను సీక్వెస్టర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
మేము అత్యంత పురాతన చెట్లను క్లోన్ చేస్తున్నాం. ఇందులో సీక్వోయాస్, రెడ్‌వుడ్ వృక్షాలే అధికం. దాదాపు 2,000-4,000 ఏళ్ల వయసుగల రెడ్‌వుడ్స్‌తో పాటు వేలాది సంవత్సరాలుగా అడవి మంటలు, వ్యాధుల నుంచి బయటపడిన జెయింట్ సీక్వోయాలు ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల తుడిచిపెట్టుకుపోయే ప్రమాదంలో ఉన్నాయి. ప్రపంచంలో చివరగా మిగిలిన సీక్వోయాలు కాలిఫోర్నియా, పశ్చిమ సియెర్రా నెవాడాలోని ఇరుకైన బెల్ట్‌లో గల 75 తోటల్లో పెరుగుతున్నాయి. 45 సెంటీమీటర్ల మందపాటి బెరడు కలిగిన ఈ చెట్లు దాదాపు 90 మీటర్ల పొడవు పెరుగుతాయి. కానీ కార్చిచ్చుల వల్ల 75,000కు పైగా చెట్లలో 10-14% నాశనమయ్యాయి. మేము ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 130 వివిధ రకాల పురాతన చెట్లను కనుగొన్నాం. ఆరోగ్యకరమైన పురాతన చెట్టులోని ఒక చిన్న ముక్కను ఉపయోగించి నాలుగేళ్లలో 5 మిలియన్ చెట్లను క్లోన్ చేయొచ్చు. నమూనాలు టాప్ బ్రాంచ్ నుంచి తీసుకుంటాం. ఇవి హార్మోన్ల మిశ్రమంతో పాటు స్టెరైల్ ఫోమ్ క్యూబ్‌కు జోడించబడతాయి. ఈ ఫోమ్ క్యూబ్‌లను హార్మోన్‌లతో ఉపయోగించడం ద్వారా మేము 3-4 శాతం సక్సెస్ రేట్ నుంచి 97 శాతం సక్సెస్ రేట్‌కు చేరుకున్నాం. మోనోకల్చర్‌ను నివారించేందుకు, వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి, బలమైన, అత్యంత పురాతన చెట్ల DNA మిశ్రమంగా ఉంటుంది. ఈ చెట్లు వ్యాధులకు నిరోధకతను కలిగి ఉండేందుకు ఇదే సాయపడుతుంది.
- డేవిడ్ మిలార్చ్