నిజామాబాద్‌లో గల్లీ గల్లీకి విస్తరించిన మట్కా.. వారి ఆధ్వర్యంలోనే..?
దిశ, ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మట్కా జోరుగా సాగుతుంది.- latest Telugu news
దిశ, ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మట్కా జోరుగా సాగుతుంది. పొరుగున మహరాష్ర్ట సరిహద్ధుగా ఉండటంతో.. మహరాష్ర్టలోని నాందేడ్, ముంబాయి కేంద్రంగా జరుగుతున్న మట్కా చార్టులను తెచ్చి ఇక్కడ ఆడేస్తున్నారు. గతంలో ఆఫ్‌లైన్‌లో మట్కా చీటిలు ఉండగా ఇప్పుడు అంతా హైటెక్‌గా ఆన్‌లైన్‌లోనే జోరుగా నడుస్తుంది. నిజామాబాద్‌లో మట్కా గ్యాంగ్‌లకు కొదువ లేకుండా పోయింది. గత 15రోజుల నుండి ఇప్పటి వరకు 5 కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ నగరంలో ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో జోరుగా మట్కా సాగుతున్నట్లు సమాచారం. గతంలో మట్కా చీటిలు దొరికితే, డబ్బులు కలిగి ఉంటే పట్టుకునే వారు. నేడు హైటెక్ పద్ధతిలో స్మార్ట్ ఫోన్‌లలో సాగుతుండడంతో పక్క సమాచారం ఉంటేనే మట్కా ఆడేవారు దొరుకుతున్నారు. గతంలో ఆఫ్ లైన్ వ్యవస్థలో ప్రధాన ఏజెంట్‌కు డబ్బులు చేరవేయ్యడం రిస్క్‌తో కూడుకోగా.. ఇప్పుడు అంతా ఆన్‌లైన్ లలో జరుగుతుండటంతో పోలీస్‌లకు మట్కా గ్యాంగ్‌లను పట్టుకోవడం రిస్క్‌గా మారింది.
నిజామాబాద్ నగరంలో మట్కా ఆడే వారికి కొదవ లేకుండా పోయింది. పొలిటికల్ లీడర్ల, కూలీలు, యువతతో ఇలా అన్ని వర్గాల వారు మట్కా మత్తులో పైసలు పొగొట్టుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలో గంజాయి సరఫరాతో పాటు పీడీఎస్ బియ్యం దందాలో అరితేరిన వారే ఇప్పుడు మట్కా దందాలో బిజీగా ఉన్నారు. ఇటివల కాలంలో ఐదు కేసులు నమోదు కాగా అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. గతంలో కేసులు, పీడి యాక్ట్‌లు ఉన్న వ్యక్తుల ఆధ్వర్యంలోనే ఈ దందా సాగడం కొసమెరుపు. ధర్మపూరి హిల్స్, పేయింటర్ కాలనీ, డైరీ పారంతో పాటు ఆటో నగర్, ముజిహిద్ నగర్‌లో జోరుగా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం.