శుభకార్యానికి వెళ్లిన కుటుంబం.. తిరిగి వస్తుండగా దారుణం
దిశ, ఆందోల్: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా లారీ-కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి..latest telugu news
దిశ, ఆందోల్: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా లారీ-కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్ సాన్ పల్లి శివారులోని జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ షకీల్ (27), అతని అత్తగారి గ్రామమైన నిజామాబాద్ జిల్లా వర్నిలో జరిగిన శుభకార్యాన్ని వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తన భార్య ఫాతిమా బేగం, అమ్మ షబానా బేగం, తమ్ముడు పకిరోద్దీన్, 40 రోజుల వయసున్న తన కొడుకును తీసుకుని వర్ని మహమ్మద్ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరాడు.
కన్ సాన్ పల్లి వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి అల్లాదుర్గం వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మహమ్మద్ షకీల్ అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారి బాబు మినహా మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.