సరికొత్త జ్యువెలరీ ట్రెండ్ః తల్లిపాలతో ఆభరణాల తయారీ..!
"బ్రెస్ట్ మిల్క్ జ్యూలరీ" సరికొత్త ట్రెండ్‌గా మారి కోట్లాను కోట్లు కుమ్మరిస్తోంది. Making Jewelry Out Of Breast Milk.
దిశ, వెబ్‌డెస్క్ః అమ్మ ప్రేమ అన్నింటికీ అతీతమైనది. కడుపులో పడిన దగ్గర నుంచి కడతేరే వరకూ అమ్మ మన పక్కనుంటే ఎలాంటి ఆపదా రానీయ్యదు. అసలు, పుట్టగానే తల్లి పాలు తాగితే అదే సహజమైన మందులా మనల్ని జీవితాంతం కాపాడుతుంది. అందుకే, అమ్మ ప్రేమకు మొదటి చిరునామా అయిన చనుబాలకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. తల్లికీ బిడ్డకు ప్రత్యక్ష అనుబంధాన్ని పంచిచ్చే అలాంటి చనుబాలు ఓ జ్ఞాపకంగా దాచుకోవాలని ఎవరికుండదు..?! సరిగ్గా, ఇలాంటి అత్యద్భుత అనుబంధపు అనుభవం నుంచి పుట్టిందే "బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ". సరికొత్త ట్రెండ్‌గా మారి కోట్లాను కోట్లు కుమ్మరిస్తోంది. మనిషి అవసరాన్ని దాటి ఎమోషన్‌పై వ్యాపారం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ జ్యువెలరీ ట్రెండ్ సూపర్ సక్సెస్ అయ్యింది.
అమ్మ ప్రేమకు మొదటి అనవాలుగా ఉన్న చనుబాలను ఫ్రేమ్‌లో పెట్టి సుదీర్ఘ కాలం ఉంచుకోడానికి సఫియా, ఆడమ్ రియాద్‌లు కలిసి అవార్డు విన్నింగ్ 'మెజెంటా ఫ్లవర్స్' అనే వ్యాపారాన్ని ఇటీవల ప్రారంభించారు. 2019లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ మెజెంటా ఫ్లవర్స్ 4,000 ఆర్డర్‌లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.అలాగే, వీరి వ్యాపారంతో పాటు తల్లి పాల ఆభరణాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. అందుకే, 2023లో 1.5 మిలియన్ పౌండ్ల (రూ. 15 కోట్లు) టర్నోవర్ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు 'డైలీ స్టార్' నివేదించింది. ఇక, ముగ్గురు పిల్లల తల్లి అయిన సఫియాకు పాలివ్వడం ఎంత కష్టమో ప్రత్యక్షంగా తెలుసు. ఆ ప్రయాణాన్ని మధురానుభూతిగా ఉంచుకోవాలనే తల్లుల కోరికను ఆమె అర్థం చేసుకుంది. చివరికి, సఫియా తల్లిపాలను డీహైడ్రేట్ చేసే సాంకేతిక ప్రక్రియలో అడుగుపెట్టింది. మెజెంటా ఫ్లవర్స్ కంపెనీ ద్వారా చేతితో తయారు చేసిన తల్లి పాల నెక్లెస్‌లు, చెవిపోగులు, ఉంగరాల వంటి ఆకర్షణీయ ఆభరణాలను తయారుచేస్తున్నారు.