Kishan Reddy: త్వరలో తెలంగాణలో మహారాష్ట్ర పరిస్థితి.. కిషన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Maharashtra situation will repeat in telangana says Kishan Reddy| మహారాష్ట్రలో ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. తమ పార్టీలో ఎవరైనా రెబల్స్ ఉన్నారా? అనే చర్చ తెరవెనుక అన్ని పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. అయితే అందరి దృష్టిని మాత్రం

Update: 2022-07-01 08:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: Maharashtra situation will repeat in telangana says Kishan Reddy| మహారాష్ట్రలో ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. తమ పార్టీలో ఎవరైనా రెబల్స్ ఉన్నారా? అని తెరవెనుక అన్ని పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. అయితే అందరి దృష్టిని మాత్రం తెలంగాణ ఆకర్షిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి. దీంతో త్వరలో మహారాష్ట్ర మాదిరిగానే కేసీఆర్ సర్కార్‌కు ముప్పు ఉందా? అనే టాక్ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. ఒకవేళ ముప్పు ఉంటే కేసీఆర్‌ను ఎదిరించి ధిక్కార స్వరం వినిపించేదెవరు? తెలంగాణ ఏక్ నాథ్ షిండే‌గా అవతారమెత్తేది ఎవరు? అనేదే పెద్ద ప్రశ్నగా మారింది.

కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు:

పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోడీ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీజేపీని ఆపడం కేసీఆర్ తరం కాదన్నారు. రాష్ట్రంలో మీ పతనం ప్రారంభమైందని, మహారాష్ట్రలో శివసేన పుత్ర వ్యాత్సల్యంతో చూపిన ప్రేమ కారణంగా అక్కడ పతనం జరిగిందని.. తెలంగాణలో కూడా అదే కాబోతోందని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అసంతృప్తితో ఉన్నారనే టాక్, విపక్షాల నుండి విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలో తెలంగాణ రాజకీయాల్లో భారీ కుదుపు ఏమైనా ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం రాకమానవు అంటున్నారు రాజకీయ పండితులు.

తెలంగాణ ఏక్ నాథ్ షిండే ఎవరూ?

రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చి ప్రజల మనసులు గెలుచుకున్న టీఆర్ఎస్ ఇటీవల ప్రతిపక్షాల నుండి భారీ స్థాయిలో పోటీని ఎదుర్కొంటోంది. కేసీఆర్ నేతృత్వంపై ఆ పార్టీలో ఇప్పటి వరకు వ్యతిరేకత బహిర్గతం కాలేదు. ఈటల వ్యవహారం మినహా ఎక్కడా ఆయన నాయకత్వాన్ని, నిర్ణయాలను ప్రశ్నించిన దాఖలాలు లేవు. అధినేత నిర్ణయం సమ్మతం అయితే ముందుకు వచ్చి జై కొట్టడం లేదంటే మౌనంగా ఉండిపోవడమే ఇప్పటి వరకు టీఆర్ఎస్‌లో జరుగుతున్న రాజకీయం. కానీ, తెలంగాణపై బీజేపీ నజర్ వేసిందనే ప్రచారంతో అధినేతను ధిక్కరించే ఆ నాయకుడు ఎవరనేది ప్రధానమైనాంశం. తెలంగాణలో టీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టాలని చూస్తున్న బీజేపీ ఆలోచనతో కలిసి వచ్చేవారు గులాబీ పార్టీలో ఉన్నారా? అనే చర్చ టీఆర్ఎస్ లోనూ మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. పక్కలో ఉంటూ పార్టీకి ద్రోహం చేయాలనే ఆలోచనల్లో ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

సంఖ్యాబలం రీత్యా కేసీఆర్ సర్కార్ కు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీ లేకపోయినా.. రాబోయే ఎన్నికల అనంతరం అప్పటి సమీకరణాల సమయానికి బీజేపీ తన ప్లాన్ అమలు చేసే అవకాశాలు లేకపోలేదు. టీఆర్ఎస్ లో కేటీఆర్ కు నానాటికి ప్రయార్టీ పెరిగిపోతున్న నేపథ్యంలో పార్టీలోని అసంతృప్తులకు గాలం వేస్తే అది టీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


కేసీఆర్‌కు ఆ అవకాశమే లేదుగా:

మహారాష్ట్రలో శివసేన నిలువునా చీలిపోయింది. అసమ్మతి నేతలంతా ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఉద్ధవ్ ఠాక్రేకు శఠగోపం పెట్టారు. ముఖ్యమంత్రి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని అసమ్మతి నేతలు వాపోయారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా పార్టీకి ద్రోహం చేశారని, వారంతా వెన్నుపోటుదారులని ఉద్ధవ్ ఠాక్రే శిబిరం ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంలో ఉద్ధవ్ వర్గానికి కాస్త సానుభూతి లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఒకవేళ ఇదే సీన్ తెలంగాణలో గనుక రిపీట్ అయితే కేసీఆర్‌కు ఆ సానుభూతి లభించడం సాధ్యమేనా? అనే మాట వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఇతర పార్టీల వారిని తమ పార్టీలో చేర్చుకుంది. ఇది అనైతిక చర్య అని చెప్పినా టీఆర్ఎస్ మాత్రం వాటికి కొత్త భాష్యాలు చెబుతూ డోస్ మరింత పెంచింది. ఈ నేపథ్యంలో కాలం కలిసి రాక టీఆర్ఎస్‌లో ఎవరైనా అసమ్మతి రాగం ఆలపిస్తే ఇది అనైతికమైన చర్య అని విమర్శించేందుకు కేసీఆర్‌కు ఆ అవకాశమే లేదనే అభిప్రాయం బీజేపీ పార్టీ అంచనా వేస్తోందని, సందర్భం వచ్చిన నాడు ఖచ్చితంగా టీఆర్ఎస్ నిలువునా చీలిపోతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజకీయాల్లో కాదేది అనర్హం అన్నట్లు ఇవాళ అన్ని పరిస్థితులు బాగున్నాయనుకునే లోపే ప్రత్యర్థులు కుర్చీ కింద నిప్పు పెట్టే చర్యలు జరగకమానవు అనే మాటను రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు. పార్టీలో పట్టు కోసం ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకునే కేసీఆర్ మహారాష్ట్ర ఉదంతం తర్వాత ఎలాంటి ప్లాన్లలో ఉన్నారనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News