గంగ నెత్తిన ఉన్నా.. అక్కడ నీరు దొరకదు..
దిశ, గండిపేట్ : గంగను నెత్తిన పెట్టుకొని నీటి కోసం అల్లాడుతున్నట్లుగా మారింది..latest telugu news
దిశ, గండిపేట్ : గంగను నెత్తిన పెట్టుకొని నీటి కోసం అల్లాడుతున్నట్లుగా మారింది హిమాయత్‌సాగర్ వాసులకు. తాగుదామంటే గుక్కెడు మంచినీరు ఉండదు.. కొనడానికి డబ్బు ఉండదు.. ఎవరిని కలిసినా.. చేద్దాం అంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఇది బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పరిస్థితి. వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌సాగర్ వాసులు నీటికటకటను ఎదుర్కొంటున్నారు. మంచినీటి సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు. రోజువిడిచి రోజు రావాల్సిన మంచినీరు సైతం అందడం లేదు. మంచినీరు లేకపోవడంతో డబ్బులు ఉన్న వారు మినరల్ వాటర్ తాగితే లేని వారు బోర్ నీళ్లు తాగే పరిస్థితి దాపురించింది.
ఇంత నీటి సమస్య ఉన్నా కార్పొరేషన్‌లో మంచినీటిని అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా పరిష్కరిస్తామంటూ చెబుతారు కానీ సమస్యలను పరిష్కరించే దిశగా ఏ అధికారి, ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ప్రజల సమస్యలు పట్టవా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. గతంలో పంచాయతీగా ఉన్న సమయంలో సర్పంచ్ మంచినీటిని అందించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకునేవారు. కానీ మున్సిపాలిటీగా మారిన తర్వాత నుండి అధికారులు పన్నులపై దృష్టి సారించినంతగా సమస్యల పరిష్కారంలో చూపడం లేదు. శ్రీమంతులు ఉంటున్న కాలనీలకు మాత్రం నీటిని అందిస్తున్నారు. రోజువిడిచి రోజు రావాల్సిన నీరు పది రోజులైనా రాకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు తెలుపుతున్నారు. కృష్ణా గోదావరి నీటిని అందిస్తామని చెప్పి ఇప్పుడేమో హిమాయత్‌సాగర్, గండిపేట్‌లపై ఉన్న జీవోను ఎత్తేస్తామంటూ చెప్పి ప్రజలను మోసగిస్తున్నారని స్థానికులు అంటున్నారు. హిమాయత్‌సాగర్ పేరు పెట్టుకొని హిమాయత్‌సాగర్ నీళ్లు తాగలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా కార్పోరేషన్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
మంచినీటిని అందించేందుకు చొరవ చూపాలి : కార్పొరేటర్ రాము
హిమాయత్‌సాగర్ పక్కనే ఉన్నప్పటికీ హిమాయత్‌సాగర్ ప్రజలకు నీరు అందడం లేదు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు నీటి కష్టాలు తీరలేదని, కనీసం మున్సిపాలిటీ అయ్యాక అయినా తమకు నీరు అందుతుందని ఆశపడ్డా వృథాగానే మారింది. అధికారులు చొరవ చూపి ప్రజలకు మంచినీటిని అందించాలి. ప్రధానంగా 60 గజాలలో నివసిస్తున్న ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకొని ఎండాకాలంలో మంచినీరు అందేలా చూడాలి. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. కానీ పైపులైన్ వేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.