AP News: సైనికులుగా ఉందాం : ఏడుపులు,శోకాలు వద్దంటున్న నానీలు

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది

Update: 2022-04-11 10:17 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. కేబినెట్‌లో బెర్త్ ఆశించి భంగపడ్డ ఆశాహుల అనుచరులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. తమ నేతకు మంత్రి పదవి దక్కని నేపథ్యంలో వారంతా సీఎం వైఎస్ జగన్‌పైనా, వైసీపీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మాజీమంత్రులు మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అన్నె రాంబాబు, సామినేని ఉదయభాను, కరణం ధర్మశ్రీ వంటి నేతల అనుచరులు నానా రాద్ధాంతం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంత్రివర్గంలో చోటు దక్కకపోయినప్పటికీ మాజీమంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు మాత్రం ఎలాంటి అలకపాన్పు ఎక్కలేదు. మంత్రి పదవి దక్కలేదని అలగాల్సిన అవసరం తమకు లేదని చెప్పుకొచ్చారు.

మంత్రి పదవిపోయినందుకు బాధ లేదు : పేర్ని నాని

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ నిర్ణయాన్ని తాను ఎప్పుడూ గౌరవిస్తానని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ కేబినెట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేబినెట్ కూర్పులో సామాజిక న్యాయం చేసి చూపించారని కొనియాడారు. మంత్రి పదవి పోయినందుకు తానేమీ నిరాస నిస్పృహలకు గురికావడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వందకు వంద శాతం తాను సంతృప్తిగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా? ఇంకా ఏమైనా బాధ్యతలు అప్పగిస్తారా అనేది తెలియాల్సి ఉందని.. అయితే సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో చేస్తానని మాజీమంత్రి పేర్ని నాని వెల్లడించారు.

ఊపిరి ఉన్నంత వరకు జగన్‌తోనే : మాజీమంత్రి కొడాలి నాని

మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంపై మాజీమంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం నాడే తెలియజేశారని గుర్తు చేశారు. సీఎం జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉన్నానని.. ఇకపై కూడా ఉంటానని చెప్పుకొచ్చారు. తన ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌ వెంటే నడుస్తానని చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారన్న ప్రగాఢ విశ్వాసం తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు కొడాలి నాని కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం కోసం..పార్టీ కోసం అందరం కట్టుబడి ఉండాలి. వీళ్లు నా మనుషులు, వీళ్లను పదవి నుంచి తీసినా బాధపడరు అని జగన్ భావించారు. దయచేసి పదవులు రానివారు ఏడుపులు, శోకాలు పెట్టొద్దు. జగన్ వెనుకాల సైనికుల్లా నిలబడదాం. మనకెవరికీ జగన్ అన్యాయం చేయరు అని కొడాలి నాని సూచించారు.

Tags:    

Similar News