ఉద్యోగం వదిలి.. ప్రజాక్షేత్రంలోకి రావడం "త్రిల్ "గా ఉంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, తుంగతుర్తి: ఆరున్నర సంవత్సరాల పదవీకాలాన్ని వదులుకొని రాజకీయంగా ప్రజాక్షేత్రంలోకి latest telugu news..
దిశ, తుంగతుర్తి: ఆరున్నర సంవత్సరాల పదవీకాలాన్ని వదులుకొని రాజకీయంగా ప్రజాక్షేత్రంలోకి రావడం "త్రిల్" గా ఉందని బీఎస్‌పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాల జాతిలో పుట్టి పెరిగి ఊహించని కష్టాలతో ఎదిగి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా తాను ఏనాడు ఏసీ వాతావరణానికి పరిమితం కాలేదని పేర్కొన్నారు. జనగామ జిల్లా ఖిలాషాపూర్ ప్రాంతం ద్వారా ఈ నెల 6 నుంచి ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన "దిశ"కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ప్రాముఖ్యత అంశాలు వివరించారు. ముఖ్యంగా ఉద్యోగం, రాజకీయం అనేవి వివిధ రకాల నిబంధనలకు లోబడి ఉంటాయని పేర్కొంటూ వివరించారు. ఉద్యోగం లో కఠినమైన నిబంధనలు, బాసిజం ఉంటే.. రాజకీయంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు తాను చెప్పాల్సిన వివిధ రకాల భావాలు దాచుకోవాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ బీఎస్‌పీ సిద్ధాంతాలు తనను ఎంతో ఆకర్షించాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా గురుకులాల కార్యదర్శి గా తాను ఒక శాతం మాత్రమే పేద వర్గాలకు సహాయ పడ్డానని, రాజకీయాల్లోకి వస్తేనే మిగతా 99 శాతాన్ని పూర్తి చేస్తాననే నమ్మకం తనకు కలిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికీ అందులో అనగారిన వర్గాల వాటా ఎంతో తెలియని స్థితి నెలకొందన్నారు. గొర్రెలు, డబుల్ బెడ్ రూమ్, తదితర పథకాలు వృధా అంటూ వివరించారు. ధరణి పోర్టల్ లోపాల పుట్టగా మారిందన్నారు. ముఖ్యంగా ఆధిపత్య పార్టీలే సంపదను తమ చేతుల్లో పెట్టుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభా ఉంటే సీఎం కార్యాలయంలో ఎస్సీలతో పాటు మిగతా వారి వాటాలు ఎంత ఉన్నాయని ప్రశ్నించారు.
యూపీ ఫలితాల ప్రభావం తెలంగాణ పై పడదు
ఉత్తరప్రదేశ్ లో ఓటమిపాలైన బీఎస్‌పీ పరిణామాలు తెలంగాణ రాష్ట్రంపై ఏమాత్రం పడవని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుందని వివరించారు. పంజాబ్ రాష్ట్రంలో ఓడిన బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో గెలిచిందని, ఇదే పరిస్థితి దాదాపు ఇంచుమించుగా మిగతా రాష్ట్రాల్లో ఉందని ఉదహరించారు. ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీల పరిస్థితుల మార్పు ఒక్క రోజులో అయ్యే పని కాదని దీనికి చాలా సమయం తీసుకుంటుందని తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేదు కాబట్టే బీఎస్‌పీ అంటే తక్కువ మందికే తెలిసేదని, ప్రస్తుతం గ్రామాలు, వాడలు, వీధులు, ప్రతి ఇంటికి తిరిగి బీఎస్‌పీ బలీయ శక్తిగా మారుస్తామని ఆయన వివరించారు.
మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి..
"మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి" అనే నినాదంతోనే తాము పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు. 13 వందల మంది అమరవీరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ నేడు కొందరి చేతుల్లో కుటుంబ తెలంగాణ మారిందని ఆయన పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. దోపిడి, అన్యాయం, అక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఆధిపత్య చేతుల్లో బందీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు, మద్యం ఎర చూపి దొడ్డి దారిన వచ్చే నాయకులు కావాలో? లేక పేదల కన్నీళ్లు తుడిచే నాయకుడు కావాలో? అనే విషయాలను మీరే తేల్చుకోండి అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నట్లు వివరించారు. విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల వాటిపైనే ప్రధాన దృష్టిని కేంద్రీకరించామనీ ఆయన వివరించారు.
తన 14 రోజుల పాదయాత్రలో కేసీఆర్, మంత్రులు ప్రజల విశ్వసనీయతను కోల్పోయారనే విషయాలు స్పష్టంగా ప్రజల ద్వారా తెలుస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా వారందరికీ వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, ప్రభుత్వం ఇచ్చే వివిధ రకాల హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఎన్నికల ముందే ఉద్యోగాలు, తదితర పథకాలపై పాలకుల నోటి వెంట ప్రకటనలు వెలువడుతున్న విషయాలను ప్రజలు పూర్తిగా గ్రహించినట్లు తెలిపారు. వివిధ రకాల నోటిఫికేషన్ లపై నిరుద్యోగులకు నమ్మకం లేదని తెలిపారు. విద్యను కాకుండా మద్యాన్ని పంచుతూ.. తెలంగాణ తాగుబోతుల రాష్ట్రంగా మారిందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అర్థం పర్థం లేని పథకాలతో వచ్చే ఆదాయం ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు.
పొత్తులపై ఇప్పుడే చెప్పలేం..
రాష్ట్రంలో తొలిసారిగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితులు విచిత్రంగా మారుతున్నాయని,అయితే భవిష్యత్తులో పొత్తులపై ఇప్పుడే చెప్పలేమని పేర్కొంటూ దాని గురించి ఆలోచనే లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు.అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయం కూడా ఇంకా నిర్ణయించుకోలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.