KTR: ‘రైతులేమైనా తీవ్రవాదులా..? అల్లుడి కోసం ఇంత అరాచకానికి ఒడిగడతారా..?’ రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కొడంగల్‌లో జరిగింది కుట్ర కాదని, సీఎం రేవంత్ వైఖరి వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 6 నెలలుగా కొడంగల్‌లో ఈ వివాదం కొనసాగుతోందని, కొడంగల్ రైతులు జైలుకు పోతే.. స్థానిక ఎమ్మెల్యే రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించకుండా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారని నిలదీశారు. ‘రైతులను తీవ్రవాదుల్లా చూస్తున్నారు. టెర్రరిస్టుల మాదిరి మాజీ MLAను అరెస్ట్ చేస్తారా..? డబ్బులు సంపాదించి మూటలు మోయడానికే సీఎం పదవి చేపట్టారా..?’ అంటూ ప్రశ్నించారు. అలాగే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని, కిడ్నాప్ చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అల్లుడి కంపెనీ విస్తరణ కోసమే భూసేకరణ చేపట్టారని, ఇంత అరాచకానికి ఒడిగట్టారని ఆరోపించిన కేటీఆర్.. సురేష్ బీఆర్ఎస్ కార్యకర్త అనేది నిజమని, అయితే అతడి భూమి కూడా ఈ ప్రాజెక్ట్‌లో పోతోందని, మా కార్యకర్త నాయకుడితో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. కొడంగల్ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
‘కొడంగల్‌లో జరుగుతున్న వివాదం ఈ నాటిది కాదు.. గత 6, 7 నెలలుగా కొనసాగుతోంది. మీకందరికీ గుర్తుండే ఉంటుంది. 6 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డిది ఓ ఫాన్ కాల్ లీక్ అయింది. ఓ రైతు తాము భూములు ఎందుకు ఇవ్వాలని గట్టిగా అడిగితే.. ఇయ్యకపోతే తన్ని లాక్కుంటామని తిరుపతి రెడ్డి సమాధానం ఇచ్చాడు. భూమి పోగొట్టుకుంటున్న రైతులంతా గిరిజన లంబాడా రైతులే.. సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా అదేమీ పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పార్టీకి మూటలు మోస్తున్నాడు. రేవంత్ రెడ్డి కొడంగల్ రావాలి. వచ్చి రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. భూసేకరణ పేరిట దళిత, గిరిజన, ఓబీసీల భూములను లాక్కుని వాటిని తమ అనునాయులకు కట్టబెడుతున్నారు. రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారాలు చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నారు. రైతుల అరెస్టులు అమానుషం. ఇంటర్నెట్‌ను బంద్ పెట్టి అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తారా..? ఇంటర్నెట్ బంద్ చేయడం తప్పని ఇంతకుముందే కోర్టు చెప్పింది. మా నాయకుడు పట్నం వెంకటరెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారు. అది అరెస్టా..? కిడ్నాపా..? బీఆర్ఎస్ నేతలను అరెస్ట్‌లు చేయడం మూర్ఖపు చర్యే’ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.