మోసం చేస్తున్న విద్యుత్ అధికారులు.. బిల్లింగ్ మిషన్లలో గోల్‌మాల్

‘ఖమ్మం మమత రోడ్‌లోని ఓ అపార్టుమెంట్లో తొమ్మిది ప్లాట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్‌కు ప్రతి నెలా రూ.వెయ్యిలోపే కరెంట్ బిల్ వచ్చేది.

Update: 2022-08-05 04:41 GMT

'ఖమ్మం మమత రోడ్‌లోని ఓ అపార్టుమెంట్లో తొమ్మిది ప్లాట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్‌కు ప్రతి నెలా రూ.వెయ్యిలోపే కరెంట్ బిల్ వచ్చేది. జూన్‌లో అందులోని ఒక మీటర్‌కు రూ.750 బిల్ వస్తే.. జూలై మాత్రం రూ. 7వేల బిల్ వచ్చింది. మరో మీటర్‌కు జూన్ నెలలో రూ. 215 వస్తే.. జూలైలో మాత్రం రూ.వెయ్యి వచ్చింది. దీంతో తలపట్టుకున్న యజమాని విద్యుత్ ఉన్నతాధికారుల దగ్గరి వెళ్లి అడిగితే రకరకాల కారణాలు చెప్పారట. రీడింగ్ తీసే మిషన్లపై వంక పెట్టారట. బిల్లింగ్ మళ్లీ చేయిస్తామన్నారట. కానీ శఠగోపం పడ్డది మాత్రం వినియోగదారునికే కదా..! మరి అంతగా అవగాహన లేని విద్యుత్ వినియోగదారుని సంగతి? నడ్డి విరిచే ఈ బిల్లుల సంగతి??'

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఒక మధ్య తరగతి వారికి మహా అయితే రూ.1000 నుంచి రూ1500 మధ్యలో సాధారణంగా కరెంట్ బిల్లు వస్తుంది.. కొంచెం ఎక్కువయితే రూ. 2000, రూ. 2500.. వరకు రావొచ్చు.. కానీ కొందరికి రూ.7000 నుంచి రూ.10వేల వరకు బిల్లులు వస్తున్నాయి. ఈ బిల్లులను చూసిన వారికి గుండె గుభేల్ మంటోంది. ఒక చిన్న ఫ్యామిలీకి ఇంత కరెంటు బిల్లులు రావడం ఏంటని తలలు పట్టుకుంటున్నారు. కరెంటు ఆఫీసులకు వెళ్తే మీరు వాడుకుంటేనే కదా వస్తుందంటూ సమాధానం చెబుతున్నారు. అయితే కొందరికి బిల్లులు అధికంగా రావడం వెనుక కరెంటోళ్ల మాయాజాలం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ అధికారులే కరెంటు బిల్లులు అధికంగా వచ్చేలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సకాలంలో బిల్లింగ్ కు పంపించకుండా విద్యుత్ ఏఈ, డీఈలే ఉద్దేశపూర్వకంగానే కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చేలా చేస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది.

ఓ మధ్యతరగతి వ్యక్తికి ప్రతినెలా రూ.1400 నుంచి రూ.1800 మధ్యలో కరెంటు బిల్లు వస్తుంది. కానీ ఆ వ్యక్తికి ఈనెలలో రూ.2500 వరకు బిల్లు వచ్చింది.. అయితే బిల్లింగ్ చేసే వ్యక్తి ప్రతి నెలలా కాకుండా మూడు, నాలుగు రోజులు ఆలస్యంగా వచ్చి బిల్లింగ్ చేశాడు. తీరా ఈ నెల బిల్లు రూ.2500 వచ్చింది. మరో మిడిల్ క్లాస్ వారికి ప్రతి నెలా రూ. 2000వరకు వస్తుంటుంది.. కానీ ఒక నెల మిస్ చేసిన బిల్లింగ్ కు రాకుండా రెండో నెల వచ్చాడు.. దీంతో ఆయనుకు ఈ నెల బిల్లు రూ. 7300వచ్చింది ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇంకో వ్యక్తి.. వేర్వేరు మిషన్ల ద్వారా బిల్లింగ్ చేస్తున్నారని రెండింటి ద్వారా వేర్వేరుగా బిల్లు వస్తుందనే విషయాన్ని గమనించాడు. తెల్ల మిషన్, నల్లమిషన్ ద్వారా బిల్లింగ్ చేస్తే సుమారు రూ200నుంచి రూ300 వరకు తేడా వస్తోందని ఆయన చెబుతుండడం గమనార్హం. ఇలా ఒక్కరిద్దరికే కాదు చాలా మందికి వేలల్లో బిల్లులు వస్తుండడంతో లబోదిబోమంటున్నారు. ఏం చేయాలో పాలుపోక కరెంటోళ్లను సంప్రదించినా ఫలితం కనిపించడం లేదు.

అంతా ఏఈ, డీఈలే నడిపిస్తున్నారు..

వాస్తవానికి విద్యుత్ వినియోగాన్ని బట్టి బిల్లు వస్తుంటుంది. వంద యూనిట్ల వరకు వినియోగిస్తే ఒక్కో యూనిట్‌కు రూ.3.50 చార్జ్ పడుతుంది. 101నుంచి 200 యూనిట్ల వరకు కాల్చితే ఒక్కో యూనిట్‌కు రూ. 4.50 చార్జ్ పడుతుంది.. 201 నుంచి ఒక్కో యూనిట్ కు రూ.6 చెల్సించాల్సి ఉంటుంది. అందుకే విద్యుత్ అధికారులు వినియోగదారుల ఇళ్లకు ఆలస్యంగా బిల్లింగ్ చేసేందుకు పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వినియోగదారుడికి పడాల్సిన యూనిట్ల కంటే అదనపు యూనిట్లు చూపిస్తుంది. దీంతో యూనిట్ కాస్ట్ కూడా పెరిగి ఏకంగా డబుల్ బిల్లులు వస్తున్నాయి. అయితే ఈ తతంగం ఇలా ఉంటుందని తెలిసే విద్యుత్ అధికారులు బిల్లింగ్ చేసే వారిని ఆలస్యంగా పంపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు.. కొంతమంది వినియోగదారులకు రెండు నెలలకు ఒకసారి బిల్లింగ్ చేయడం వల్ల యూనిట్ కాస్ట్ పెరిగి బిల్లు ఊహించనంతగా వస్తుండడం గమనార్హం. అయితే ఈ వ్యవహారాలన్నీ ఏఈ, డీఈలే నడిపిస్తున్నారని విద్యుత్ సిబ్బందే చెపుతుండడం గమనార్హం.

మిషన్లలోనూ తేడానే..

వాస్తవానికి బిల్లింగ్ చేసి బిల్లు చేతిలో పెట్టి వెళ్లిపోతారు విద్యుత్ సిబ్బంది. అయితే వీరు ఏ మిషన్‌తో బిల్ చేస్తున్నారనే దానిని బట్టి కూడా బిల్లులో భారీ తేడా వస్తుందనే విషయం విద్యుత్ వినియోగదారులకు తెలియకపోవడం విశేషం. వీరు వినియోగించే మిషన్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నలుపు రంగులో ఉండేది.. అన్ లాజికల్ మిషన్.. ఇంకోటి తెలుపు రంగులో ఉండేది ల్యాంపాక్స్. ఈ రెండు మిషన్ల ద్వారా బిల్లింగ్ చేస్తుంటారు. అయితే తెలుపు రంగు ల్యాంపాక్స్ మిషన్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల బిల్లులో భారీ తేడా ఉండి ఎక్కువ బిల్లు వస్తుంది.. నల్లపు రంగు అన్ లాజికల్ మిషన్‌లో బిల్లింగ్ చేస్తే తక్కువగా బిల్లు వస్తుంది.. తక్కువలో తక్కువగా రూ. 250 వరకు తేడా ఉండడం గమనార్హం. యూనిట్ల వాడకాన్ని బట్టి ఈ తేడా ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం విద్యుత్ అధికారులకు తెలిసినా కస్టమర్లను మోసం చేస్తున్నారు.

అన్ని విధాలుగా వినియోగదారుడే బలి..

విద్యుత్ అధికారుల మోసానికి వినియోగదారుడు బలవుతున్నాడు. 30రోజులకు రాకుండా వారం, పది రోజులు ఆలస్యంగా వచ్చి బిల్లింగ్ చేయడంతో యూనిట్ కాస్ట్ పెరగడం ఒక ఎత్తయితే.. మిషన్లలో తేడా ఉందని తెలిసీ ఎక్కువగా బిల్లు వచ్చే ల్యాంపాక్స్ మిషన్లు(నలుపు రంగువి) ఇచ్చి పంపడం మరో ఎత్తు.. దీనితోడు.. ఒకనెలలో బిల్లు మరో నెలలో వేసి.. వచ్చిన బిల్లులోంచి పాతదాన్ని తీసేయడం.. రెండు నెలలకు ఒకసారి వచ్చి బిల్లింగ్ చేయడం.. ఇలా రకరకగాలు విద్యుత్ అధికారులు వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఒక మధ్యతరగతి వ్యక్తికి నెలకు రూ.1800 నుంచి 2వేల వరకు బిల్లు వచ్చేది.. రెండు నెలలకోసారి వేయడం వల్ల రూ.6900కు పైగా బిల్లు రావడం విశేయం.


Similar News