బీజేపీకి కేసీఆర్ ఝలక్.. రాజ్యసభకు వివేక్ వెంకటస్వామి..?
రాజ్యసభ సీట్లు మూడు... 10 మందికిపైగా ఆశావాహులు... ఎవరికి ఆశీస్సులు అందుతాయోననే ఉత్కంఠ నెలకొంది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ సీట్లు మూడు... 10 మందికిపైగా ఆశావాహులు... ఎవరికి ఆశీస్సులు అందుతాయోననే ఉత్కంఠ నెలకొంది. పార్టీకి మొదటి నుంచి సేవలు అందించేవారికి ఇస్తారా? లేక ఎవరు ఊహించని వారికి ఎంపీ బాధ్యతలు అప్పగిస్తారా? అనేది చర్చనీయాశంగా మారింది. కేసీఆర్ అంటేనే ఊహకందని నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. రాజ్యసభలో టీఆర్ఎస్ గళం బలంగా వినిపించేవారిని పంపి తెలంగాణ మార్క్ ను చాటేలా ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ఈ నెల చివరివారంలో ఎంపీ సీట్ల భర్తీకి నోటీఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్ డిసెంబర్ 2న రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఆస్థానం ఖాళీ అయింది. మరో రెండు స్థానాలు జూన్ మొదటి వారంలో ఖాళీ అవుతున్నాయి. అందులో కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ ల పదవికాలం ముగియనుంది. అయితే స్థానాలకు టీఆర్ఎస్ లో ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేశ రాజకీయాలపై, మరో వైపు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీపై పోరు చేస్తున్న గులాబీ అధినేత కేసీఆర్ రాజ్యసభకు ఎంపిక చేసేవారు తెలంగాణ గళాన్ని బలంగా వినిపించేలా, అండగా నిలిచేలా ఉన్న నేతలు, రాజకీయాలపై పట్టుండి, మాట్లాడేవారిని ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఉద్యమం నుంచి వెన్నంటి ఉన్నవారికా? లేక ఇతరులకు అన్నది చర్చనీయాశమైంది. స్థానాలు తక్కువగా ఉండటం ఆశావాహులు ఎక్కువగా ఉండటం కత్తిమీద సాములా మారింది. గతంలో ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికీ చేరినవారికి, ఉద్యమ సమయం నుంచి పనిచేసిన వారికి రాజ్యసభ స్థానం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పుడు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మూడు రాజ్యసభ స్థానాల్లో ఇప్పటికే బండ ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, సిట్టింగ్ సిట్టింగ్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు 84 ఏళ్లకు పైబడటంతో మళ్లీ ఇచ్చే అవకాశం లేదు. డీ శ్రీనివాస్ టీఆర్ఎస్ లో ఉండి ప్రతిపక్ష పార్టీలకు మద్దతు తెలపడం, ఎంపీ ఎన్నికల్లో ఆయన కుమారుడు అర్వింద్ ను బీజేపీ తరపున గెలిపించుకోవడంతో గులాబీ బాస్ సీరియస్ తీసుకున్నారు. దీంతో ఆయన ఉద్వాసన పలుకనున్నారు. దీంతో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ ఎంపీ స్థానాలకు నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు, మాజీ సీఎండీ సీఎల్ రాజం, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంనాయక్, వేణుగోపాలచారి, జూపల్లి కృష్ణారావు, మోత్కుపల్లి నర్సింహులు, తుమ్మల నాగేశ్వర్ రావు, గ్యాదరి బాలమల్లు, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తో పాటు టీఆర్ఎస్ కీలక నేతలు గతంలో టికెట్ ఆశించిన భంగపడ్డ నేతలు రాజ్యసభకు వెళ్లాలని ఆశిస్తున్నారు. అయితే ఎవరికి ఇస్తారనేది మరికొద్ది రోజుల్లో స్పష్టం కానుంది. ఇప్పటికే దామోదర్ రావు, సీఎల్ రాజం పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం.
వివేక్ కు రాజ్యసభ?
సీనియర్ నేత వివేక్ వెంకటస్వామికి రాజ్యసభ టికెట్ వచ్చే అవకాశాలున్నాయనే చర్చజోరందుకుంది. పదవి ఇవ్వలేదని, పార్టీ సముచిత స్థానం కల్పించలేదని కమలం గూటికి చేరిన వివేక్ ను తిరిగి టీఆర్ఎస్ లోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయాలపై అవగాహన ఉండటం, దళిత నేత కావడం, రాబోయే ఎన్నికల్లో కీలకం కానున్నారని అందుకే గులాబీ కండువా కప్పి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
వివేక్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలు సైతం టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. ఈ నెల చివరి వారంలో జూన్ లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియను మే మొదటివారంలోగా పూర్తికానుందని తెలిసింది. ఇప్పటికే ఆశావాహులు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ ను సైతం పలువురు నేతలు కలిసి టికెట్ ఇప్పించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ రాజ్యసభకు ఎవరికి అవకాశం కల్పిస్తారనే చర్చ పార్టీలో జోరందుకుంది.