కేసీఆర్.. ఒక్కసారి హాస్టల్ బువ్వ తిని చూడు : విజయశాంతి
దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి గురుకులాలకు పంపుతున్నారని ఈ రైస్‌నే వండటంతో అన్నం ముద్దముద్దగా, బంకబంకగా, మెత్తగా,
దిశ, తెలంగాణ బ్యూరో : దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి గురుకులాలకు పంపుతున్నారని ఈ రైస్‌నే వండటంతో అన్నం ముద్దముద్దగా, బంకబంకగా, మెత్తగా, బిరుసుగా అవుతుండడంతో బువ్వ తినలేక స్టూడెంట్స్ తిప్పలు పడుతున్నారని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలోని గురుకులాలకు సన్న బియ్యం అందిస్తామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఒక్కసారి ఆ అన్నం తిని చూడాలని, అప్పుడు విద్యార్థుల అవస్థలేంటో మీకు తెలుస్తాయని ధ్వజమెత్తారు. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లకు నూకల బియ్యం, దొడ్డు బియ్యం పంపుతున్నారని, ఇప్పుడు గురుకులాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉన్నాయని, వీటిలో సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. 2015 నుంచి గురుకులాలు, హాస్టళ్లలో సన్న బియ్యం పెట్టాలని సర్కారు నిర్ణయించిందని గుర్తు చేశారు. కొన్నాళ్ల కిందటి దాకా ఇది అమలవుతూ వచ్చిందన్నారు. కానీ ఇటీవల గురుకులాల్లో సన్నబియ్యం బంద్ చేశారని, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి వాటినే పంపిస్తున్నారని ఆరోపించారు. బియ్యాన్ని పాలిష్ చేయడంతో సన్నబియ్యం మాదిరి నిగనిగలాడుతూ కనిపిస్తోందన్నారు. ఈ బియ్యాన్ని వండితే అన్నం ఖరాబ్ అవుతోందన్నారు. గిన్నెలో పైన మామూలుగా కనిపిస్తున్నా.. అడుగున మాడిపోతోందన్నారు. అన్నం ఎట్లా వండినా మంచిగ అయితలేదని వర్కర్లు వాపోతున్నారని, ఆడి కాడికి పెట్టిన ఆగమైతోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. సీఎం ఇప్పటికైనా గురుకులాలకు సన్నబియ్యం పంపించాలని, విద్యార్థుల తినే తిండితో ఆటలాడుతున్న కేసీఆర్‌కు తగిన జవాబు చెప్పే రోజు తోందర్లోనే రాబోతుందన్నారు.