కరీంనగర్‌లో క్రైం.. ఏపీలో కేసు.. 33రోజుల పాటు మూగ మహిళపై దారుణం!
దిశ, ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్‌లో జరిగిన ఓ క్రైంపై ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్- latest Telugu news
దిశ, ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్‌లో జరిగిన ఓ క్రైంపై ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లాలో కేసు నమోదయింది. ఇప్పటి వరకూ వెలుగులోకి రాని ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని ఇనుకుదూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ మహిళ ఫిబ్రవరి 4న అదృశ్యం అయింది. మూగ మహిళ అయిన సదరు బాధితురాలు వంట పని చేసుకుంటూ జీవించేదని.. ఫిబ్రవరి 4న కూడా యథావిధిగా ఇంటినుండి వెల్లిన ఆమె తిరిగి ఇల్లు చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఇనుకుదూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె గురించి ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు. మార్చి 9న బాధితురాలి కుటుంబ సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ అమ్మాయి కరీంనగర్‌లో ఉందన్న సమాచారం ఇచ్చారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఇనుకుదూరు పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వగానే అక్కడి నుండి ప్రత్యేకంగా ఓ టీం కరీంనగర్ చేరుకుని తీసుకెళ్లారు.
అయితే ఇంటికి చేరిన బాధితురాలి యథావిధిగా పనికి వెల్లివస్తున్న క్రమంలో తనపై అత్యాచారం చేశారని సోదరునికి సైగల ద్వారా వివరించింది. ఈ సమాచారం ఆయన పోలీసులకు చేరవేయడంతో అక్కడి పోలీసులు కిడ్నాప్, రేప్ సెక్షన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం ఇనుకుదూరు పోలీస్ స్టేషన్‌లో కేసును మార్చిన పోలీసులు పూర్తి స్థాయి విచారణకు రంగంలోకి దిగారు. ఈ మేరకు సీఐ కొండయ్య నేతృత్వంలో పోలీసు బృందం ప్రత్యేకంగా కరీంనగర్ చేరుకుని బాధితురాలిని ఎక్కడ ఉంచారోనన్న వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అత్యంత రహస్యంగా ఆరా తీసేందుకు వచ్చిన పోలీసు బృందం నిందితులను గుర్తించే పనిలో పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బాధితురాలికి ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పి నిందితులు కరీంనగర్‌కు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.
షెల్టర్ ఎలా..
అయితే బాధితురాలి ఆచూకి దొరికిన కరీంనగర్‌లోనే నిందితులు 33 రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచి అత్యాచారానికి చేశారని అనుమానిస్తున్నారు. ప్రధానంగా నిందితులు కరీంనగర్‌లో షెల్టర్ తీసుకోవడం వెనక ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 33 రోజుల పాటు కరీంనగర్‌లో బాధితురాలిని తమ ఆధీనంలో ఉంచుకున్నారంటే నిందితులకు ఖచ్చితంగా కరీంనగర్ ప్రాంతంలో పరిచయాలు ఉండి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మూగ మహిళపై దారుణానికి ఒడిగడ్తున్నా నిందితులకు సాయం మాత్రమే చేశారా లేక వారికి షెల్టర్ ఇచ్చినట్టే ఇచ్చి నేరంలో భాగస్వాములు అయ్యారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. అంతేకాకుండా టెక్నాలజీ సాయంతో కూడా అనుమానిత మొబైల్ నెంబర్లను గుర్తించనున్నట్టు సమాచారం. మార్చి 9న బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన వ్యక్తిని కూడా మరోసారి విచారించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.