'గాంధీ'లు తప్పుకోవాలి.. కొత్త నేతలు రావాలి : కపిల్ సిబాల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి సోనియా, రాహుల్ గాంధీలు వైదొలిగి ..telugu latest news
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి సోనియా, రాహుల్ గాంధీలు వైదొలిగి కొత్త నేతకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణల అవసరం గురించి నొక్కి చెప్పారు. కొత్త నేతకు నాయకత్వం అప్పగించడానికి గాంధీలు పదవుల నుంచి దిగిపోవలసిందే అన్నారు. ఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోవడం, సోనియా గాంధీ నాయకత్వంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరిగి విశ్వాసాన్ని ప్రకటించడం తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని సిబాల్ చెప్పారు.
గాంధీలు స్వచ్చందంగా అత్యున్నత పదవుల నుంచి వైదొలగాలి. ఎందుకంటే వారు ఇకపై పదవుల్లో కొనసాగకూడదని చెప్పేంత సాహసం వారు నామినేట్ చేసిన వారికి ఉండదని సిబాల్ పేర్కొన్నారు. 73 ఏళ్ల సిబాల్ జి-23 రెబెల్ గ్రూప్ సభ్యులలో ఒకరని తెలిసిందే. బడ్జెట్ సెషన్ తర్వాత త్వరలో చింతన్ శిబిర్ పేరిట మేథోమథన సదస్సును నిర్వహించాలని గ్రాండ్ ఓల్డ్ పార్టీ నిర్ణయించడంపై సిబాల్ ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్ల తర్వాత కూడా పార్టీ ఇంకా పతనంలోకి కూరుకు పోవడానికి కారణాలను నాయకత్వం గ్రహించకపోతే సొంతగూటి నుంచి నాయకత్వం బయటకు వచ్చి చూడటం లేదని అర్థమన్నారు.
'సీడబ్ల్యూసీకి వెలుపల ఒక కాంగ్రెస్ ఉంది. దయచేసి వారి అభిప్రాయాలను వినండి. మీరు వినడానికి ఇష్టపడితే, సీడబ్ల్యూసీలో లేకున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న నాలాంటి ఎంతోమంది నేతలు పూర్తిగా కొత్త దృక్పధాన్ని కలిగి ఉంటున్నారు. సీడబ్ల్యూసీలో లేనంత మాత్రాన మా అభిప్రాయాలకు విలువ ఉండదా, కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ అంటే భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కి ప్రాతినిధ్యం వహించాలి' అని సిబల్ స్పష్టం చేశారు.