Telangana BJPలో కీలక మార్పు.. కీలక వ్యక్తిని మార్చిన జేపీ నడ్డా
JP Nadda Changes Telangana BJP Organising General Secretary| రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మార్పుల్లో భాగంగా తెలంగాణ బీజేపీలోనూ గురువారం మార్పు చోటు చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్ : JP Nadda Changes Telangana BJP Organising General Secretary| రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మార్పుల్లో భాగంగా తెలంగాణ బీజేపీలోనూ గురువారం మార్పు చోటు చేసుకుంది. సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీని మార్చుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీగా పని చేస్తున్న మంత్రి శ్రీనివాసులును పంజాబ్‌కు బదిలీ చేస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీలను మారుస్తూ నేడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో మధ్యప్రదేశ్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా అజయ్ జంబ్వాల్, కర్ణాటక ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా రాజీవ్ దివి, పశ్చిమ బెంగాల్ జాయింట్ జనరల్ సెక్రటరీగా సతీశ్ దొంద పేర్లను ఖరారు చేసి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ నియామకాన్ని ఇంకా పూర్తి చేయకపోవడంతో ఆ పార్టీలో మరింత ఆసక్తిని రేపుతోంది. మంత్రి శ్రీనివాసులు స్థానంలో ఎవరు రాబోతున్నారనేదానిపై చర్చ జరుగుతోంది.
అయితే తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దెదించుతామని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. పార్టీ బలోపేతానికి స్వయంగా అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవలే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో నిర్వహించగా అదే సమయంలో ప్రధాని మోడీ చేత భారీ బహిరంగ సభను నిర్వహించారు పార్టీ నేతలు. ఆ పార్టీ ముఖ్య నేతలు అమిత్ షా, జేపీ నడ్డా వంటి టాప్ లీడర్స్ అంతా తెలంగాణపై సీరియస్ గా పని చేయాలని దిశా నిర్దేశం చేసిన క్రమంలో పార్టీ సంస్థాగత పదవిలో కీలక మార్పు జరగడం ఆసక్తిని రేపుతోంది. వివిధ కార్యక్రమాల ద్వారా టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. గురువారం నుండి రాష్ట్రంలో ప్రజా గోస- బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలను ప్రారంభించింది. ఇందులో మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రణాళికలు వేసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఈ సోలార్ పవర్ కారుకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా (వీడియో)