వైఎస్ జగన్ అమరావతి రైతులకు క్షమాపణలు చెప్పాలి: నాదెండ్ల మనోహర్

Update: 2022-03-03 12:20 GMT

దిశ, ఏపీ బ్యూరో: 'రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తోంది. ఈ తీర్పు రాష్ట్ర ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపింది. ఇప్పటికే పునాదులు వేసి, అభివృద్ధి జరిగిన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు తీర్పుతో రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగింది.

ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో ఉండాల్సిన పరిపాలన మన రాష్ట్రంలో జగన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరంకుశ ధోరణిలో సాగుతోంది. ప్రతి ఒక్కరికి ఆయన పాలన తీరు అర్థమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి' అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి..

'రాజధానిపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూర్ఖపు నిర్ణయం కారణంగా మన రాష్ట్రానికి రావాల్సిన దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. అమరావతిని అభివృద్ధి చేసుకుని ఉంటే అది చూసి ఎంతో మంది పెట్టుబడులు పెట్టడానికి తరలివచ్చేవారు. ఆ పరిస్థితులు లేకుండా చేశారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న మన తెలుగు ప్రజలు, యువత మన రాజధాని, మన ఆంధ్రప్రదేశ్, మన అమరావతి అంటూ మనమంతా గర్వించే రీతిలో రాజధాని వస్తుందని ఇక్కడ పెట్టుబడులు పెట్టి భూములు కొనుక్కున్నారు.

అమరావతి ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకుందాం.. కార్యాలయం పెట్టుకుని వ్యాపారం చేద్దాం అన్న నమ్మకంతో వీరంతా ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరినీ అవమాన పరిచే విధంగా.. ఇక్కడ ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందనే విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందనీయకుండా కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగించింది' అని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ నిరంకుశ వైఖరి వల్ల రాష్ట్ర ప్రజలకు, అమరావతి రైతులకు ఎంతో నష్టం జరిగిందని ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

కంచెలు వేసి అడ్డంకులు సృష్టించారు..

'జగన్ రెడ్డి పరిపాలన రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను కించపరిచే విధంగా, మహిళలను అవమాన పరిచే విధంగా సాగింది. ప్రజలు, రైతుల కోసం పవన్ కల్యాణ్ ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లిన సమయంలో కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారు. కంచెలు వేసి లాఠీఛార్జ్‌లు చేసే పరిస్థితిని తీసుకువచ్చింది. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అండగా నిలబడ్డారు. ఆ ప్రాంతవాసుల్లో ధైర్యం నింపారు.

కేంద్ర ప్రభుత్వంతో గానీ, బీజేపీ నాయకులతో గాని జరిగిన మా ప్రతి చర్చలోనూ అమరావతి మొదటి అంశంగా ఉండేది. మంచి మనసుతో మన రాష్ట్రానికి రాజధాని కావాలని, విభజన తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో కుటుంబ సభ్యులను సైతం కాదని ఆ రోజున అమరావతి ప్రాంత రైతులు రాష్ట్ర ప్రజల కోసం దాతలుగా నిలబడ్డారు. అలాంటి వారిని జగన్ రెడ్డి గారు పిలిపించి కనీసం చర్చలు కూడా జరపలేదు. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది.

న్యాయం నిలబడుతుందన్న నమ్మకంతో 807 రోజుల నుంచి రైతులు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో చాలా కష్టాలు పడ్డారు. వారికి ధైర్యం నింపేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారు. అంతిమంగా న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న వారు విజయం సాధిస్తారు. దానికి కట్టుబడి ఈ రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలి. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రాంతం నుంచి వెనక్కి పంపేందుకు అంతా సిద్ధంగా ఉండాలి' అని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.



Tags:    

Similar News