రిజైన్‌ చేసిన వారికి పార్టీ బాధ్యతలు: YS Jagan

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో - Jagan comments in the context of ministerial resignations

Update: 2022-04-07 14:59 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రధాన ఘట్టం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లోని 24 మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. నేరుగా మంత్రులు తమ రాజీనామా పత్రాలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు రాజీనామాలు అందజేస్తున్న తరుణంలో సీఎం జగన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లు తనతో పనిచేసిన వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తామంతా మనస్ఫూర్తిగా రాజీనామాలు చేస్తున్నామని.. ఎలాంటి భావోద్వేగాలకు గురి అవ్వొద్దని సీఎం జగన్‌కు సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనతోపాటు వెయ్యి రోజులు ప్రయాణించిన అందరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.

మంత్రుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడత కేబినేట్‌లో అవకాశం ఇచ్చినట్లు సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. పదవులు కోల్పోయిన వారు ఎలాంటి ఆందోళన చెందొద్దని.. రాజీనామా చేసిన వారంతా పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారని, తమకున్న విశేష అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ కేబినెట్‌లో ఉన్న మంత్రులందరూ మంచివాళ్లే. వచ్చేవాళ్లు కూడా మంత్రులే. మీలో కొందరు మంత్రులుగా కొనసాగుతారు అని చెప్పుకొచ్చారు. రాజీనామా చేసిన వారందరికీ ఇప్పటి వరకు ఎలాంటి గౌరవం ఉందో అదే గౌరవం భవిష్యత్‌లో ఉండబోతుందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లు మళ్లీ మంత్రులుగా కూడా వస్తారని సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం టీడీపీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు రాజకీయం భవిష్యత్తు లేదని చెప్పుకొచ్చారు. 2024 లో మరోసారి టీడీపీ ఓటమి పాలైతే ఇక టీడీపీ ఖతం అయినట్లేనని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్లుగా కార్యాచరణ సిద్ధం చేసుకుందామని రాజీనామా చేసిన మంత్రులతో సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News