కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక అసలు వ్యూహం ఇదేనా?
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ మూడు రోజులుగా ఢిల్లీలో ఏం చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో
మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ అప్పుల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులను హస్తినకు పిలిపించుకొని అప్పు పుట్టే మార్గాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి మంజూరు చేసిన రుణాల్లో దాదాపు 80% సమకూరినా మిగిలిన 20% విడుదల చేయడానికి ఆ రెండు సంస్థలు పెడుతున్న ఆంక్షలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మిగిలిన రుణాలను విడుదల చేయడానికి ఆర్ఈసీ, పీఎఫ్‌సీ సంస్థలు కొత్త షరతును పెట్టాయి. 'థర్డ్ పార్టీ'గా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలంటూ మెలిక పెట్టాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. రాష్ట్రం మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఒప్పందం ప్రకారం అంగీకరించిన మేరకు రుణాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. కొత్త షరతులు సరికాదని వాదిస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ మూడు రోజులుగా ఢిల్లీలో ఏం చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో వర్షాలు, వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఢిల్లీలో టైమ్ పాస్ చేస్తున్నారంటూ సీఎంపై పీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్ అయ్యారు. కానీ సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగన్నంతా ఢిల్లీకి పిలిపించుకుని వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అప్పులకు ఆంక్షలు ఎదురవటంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే 'ఉదయ్'పథకం ద్వారా రూ. 10,200 కోట్లకు మార్గం సుగమమైంది. మరికొంత రుణం సమకూరవచ్చనే నమ్మకం అధికారుల్లో ఏర్పడింది. రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ఈ సమావేశాల్లో భాగంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం గతంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌లతో రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడానికి కుదిరిన ఒప్పందంపై చర్చ జరిగింది. ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి మంజూరు చేసిన రుణాల్లో దాదాపు 80% సమకూరినా.. మిగిలిన 20% విడుదల చేయడానికి ఆ రెండు సంస్థలు పెడుతున్న ఆంక్షలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. పాత ఒప్పందానికి కొత్తగా షరతులు విధించడాన్ని తప్పు పట్టిన ముఖ్యమంత్రి అధికారులకు అర్థం చేయించి మరోసారి సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జెన్‌కో-ట్రాన్స్ కో సీనియర్ అధికారులు రెండు రోజులుగా ఆ రెండు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఆ సంస్థలు ప్రస్తావించిన షరతులను అర్థరహితమైనవని పేర్కొంటూనే.. ఒప్పందం ప్రకారం బకాయిలను విడుదల చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. వారు లేవనెత్తిన అన్ని అంశాలకూ సమాధానాలను ఇచ్చిన రాష్ట్ర అధికారులు.. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని, ఒప్పందం ప్రకారం రుణాలు విడుదల అవుతాయనే అభిప్రాయంతో ఉన్నారు. ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు లేని షరతులు తాజాగా విధించడాన్ని రాష్ట్ర అధికారులు ఈ సమావేశాల్లో ప్రస్తావించారు. ఒక్కటొక్కటిగా వేర్వేరు అంశాలు కొలిక్కి వస్తుండడంతో రుణాల విడుదలపై ఏర్పడిన పీటముడి తొలిగే అవకాశం ఉందని ఈ సమావేశాల్లో పాల్గొన్న ఒకరు వివరించారు.
ఆర్ఈసీ, పీఎఫ్‌సీ షరతులేంటి?
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఆర్ఈసీ రూ. 30,536 కోట్లను రుణం రూపంలో సమకూర్చడానికి అంగీకరించింది. ఇందుకు 10.90% వడ్డీని ఖరారు చేసింది. ఇందులో దాదాపు 80% రుణాలు ఇప్పటికే విడుదలయ్యాయి. వీటితో పనులు కూడా ప్రారంభమై వేర్వేరు దశల్లో ఉన్నాయి. పీఎఫ్‌సీ కూడా రూ. 37,737 కోట్లను రుణంగా సమకూర్చడానికి అంగీకరించింది. దీనికి 10.50% వడ్డీని ఖరారు చేసింది. కొంత మొత్తం రాష్ట్రానికి విడుదలైంది. మిగిలిన రుణాలను విడుదల చేయడానికి ఈ రెండు సంస్థలు ఇప్పుడు కొత్త షరతును పెట్టాయి. 'థర్డ్ పార్టీ'గా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని రాష్ట్రం మీద ఒత్తిడి పెంచుతున్నాయి. రాష్ట్రం మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఒప్పందం ప్రకారం అంగీకరించిన మేరకు రుణాలను విడుదల చేయడానికి ఇప్పుడు కొత్తగా షరతులు విధించడం సహేతుకం కాదని రాష్ట్ర అధికారులు వాదిస్తున్నారు. కొత్తగా తీసుకునే రుణాలకు ఈ షరతులను పెట్టడంలో అర్థముందని, పాత వాటికి కూడా వర్తింపజేయడం అసమంజసమని నొక్కిచెప్పారు. ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి ఉన్న అవకాశాలపై ఆ రెండు సంస్థల అధికారులు రాష్ట్రాన్ని ప్రశ్నించారు. ఆర్బీఐ ఇటీవల వాణిజ్య బ్యాంకులకు, ద్రవ్య సంస్థలకు జారీ చేసిన సర్క్యులర్ ఇప్పుడు అప్పుల మంజూరులో కీలకంగా మారింది. ఏ సంస్థ/కార్పొరేషన్‌కు రుణాలు మంజూరు చేస్తున్నారో.. తిరిగి వాటి ద్వారా వచ్చే ఆదాయం నుంచే వడ్డీని, అసలును చెల్లించాలనే షరతును పెట్టాలన్నది ఆ సర్క్యులర్ సారాంశం.
కీలకంగా మారిన అప్పులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయం, ఖర్చు అంచనాలతో బడ్జెట్‌లో స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్బీఐ ద్వారా అప్పుల రూపంలో 53,970 కోట్లను, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల ద్వారా రూ. 41,001 కోట్లను సమకూర్చుకోవాలనుకున్నది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మాత్రం రెండేళ్లలో బడ్జెట్‌తో సంబంధం లేకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులను ప్రస్తావించి కొత్తగా ఈ ఏడాది ఇవ్వాల్సిన రుణాలపై సీలింగ్ విధించింది. దీంతో ఆర్బీఐ ద్వారా రూ. 23 వేల కోట్లు మాత్రమే సమకూరనున్నది. అంచనాల్లో దాదాపు రూ. 30 వేల కోట్లకు కోత పడనున్నది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రూ. 10 వేల కోట్ల కన్నా ఎక్కువ రాదని రాష్ట్ర ప్రభుత్వం తాజా పరిస్థితులను బట్టి ఒక అంచనాకు వచ్చింది. దాదాపు రూ. 30 వేల కోట్లకు పైగా ఎసరు పడడం ఖాయమనే భావనతో ఉన్నది. ఈ రెండింటి ద్వారా సుమారు రూ. 60 వేల కోట్ల మేర చేతికి అందే అవకాశం కోల్పోయినట్లయింది. కేంద్రంతో ఎన్ని దఫాలుగా సంప్రదింపులు జరిపినా ఆశించిన స్థాయిలో ఫలప్రదం కాలేదు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో రాష్ట్ర అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన కారణంగా 'ఉదయ్'ద్వారా రూ. 10,200 కోట్ల రుణం సాకారమైంది. ఇప్పుడు పీఎఫ్‌సీ, ఆర్ఈసీల ద్వారా కనీసంగా రూ. 20 వేల కోట్ల మేరకు సమకూరవచ్చని అంచనా. రాజకీయ కోణం నుంచి చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న ఏడాదిన్నర కాలం చాలా కీలకం. 2018 అసెంబ్లీ ఎన్నికలకు రైతుబంధు స్కీమ్ బ్రహ్మాస్త్రంగా పనిచేసిందని టీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలకు అలాంటి మరో బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటే ఆర్థిక చిక్కులు అడ్డు తగులుతున్నాయి. దీని నుంచి బయటపడటం కోసం సీఎం అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు. రాష్ట్ర స్వంత ఆదాయ వనరులను కొంత పెంచుకోగలిగినా ప్రజలకు మరో 'అద్భుతమైన', 'దేశమే అడ్డం పడే' స్కీమ్ లేకపోతే ఇబ్బందులు తప్పవనే భయం వెంటాడుతున్నది. ఆ స్కీమ్ కోసం వనరులను సమకూర్చుకోవడం ఇప్పుడు అనివార్యమైంది. ఢిల్లీ వేదికగా సీఎం చేస్తున్న ఆలోచనలు ఏ మేరకు ఫలిస్తాయన్నది వారం రోజుల్లో స్పష్టం కానున్నది.