రాహుల్ రసీద్ కమాల్..!! సాక్ష్యాధారాలున్నా చలనం లేని పాలకులు
దిశ, వరంగల్ టౌన్: ఏనుమాముల మార్కెట్ లో వెళ్లూనుకున్న అక్రమాలకు ఫిర్యాదు లేకుండా పోయింది..Irregularities in the Anumamula market
దిశ, వరంగల్ టౌన్ : ఎనుమాముల మార్కెట్లో వేళ్లూనుకున్న అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జీరో దందాకు మార్కెట్ కార్యదర్శి రాహుల్ తన శక్తివంచన లేకుండా సహకరిస్తూ.. వాటాలు పొందుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. అడ్తిదారులు, ఖరీదుదారులు చేసే మోసాలను అడ్డుకోవాల్సిన కార్యదర్శే అక్రమాలకు ఊతమిస్తున్నట్లు రైతులు, మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్రమాలు జరుగుతున్న విషయం కళ్లకు కట్టే సాక్ష్యాలు పత్రికల్లో ప్రచురితమవుతున్నా, నేరుగా దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఇదేనని తెలుస్తోంది. కోట్లాది రూపాయాల సర్కారు రాబడికి గండి పడుతున్నా... మార్కెటింగ్ ఉన్నతాధికారులు గానీ, పాలకులు గాని పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ అక్రమంలో అందరూ భాగస్వాములేనా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అసలు ఏం జరుగుతోందంటే !
మార్కెట్ కు నిత్యం మిర్చి, పత్తి, ఇతర పంట ఉత్పత్తులు వేల సంఖ్యలోని బస్తాల్లో తరలి వస్తాయి. వచ్చిన సరుకును అడ్తీ దారుల సమక్షంలో కొనుగోలుదారులు ఖరీదు చేస్తుంటారు. ఈ క్రమంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన సరుకుకు మార్కెట్ కు చెందిన కాంట చిట్టా రసీదులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు మార్కెట్ తరఫున దాడువాయిలు ఈ పని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ దాడువాయిలను కొందరు మార్కెట్ అధికారులు, ఖరీదుదారులు నయానో, భయానో మచ్చిక చేసుకుంటున్నారు. ఖరీదుదారులు కొనుగోలు చేసిన సరుకుకు దడువాయిలు మార్కెట్ రూపొందించిన రసీదు కాకుండా మామూలు తెల్లకాగితం మీద రాసిస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా గతంలోనే దిశ సాక్ష్యాధారాలతో సహా కథనం ప్రచురించింది. అయితే పత్రికల్లో ప్రచురితమైనా.. దృష్టికి తీసుకెళ్లినా కార్యదర్శి రాహుల్ మాత్రం కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం.
మార్కెట్ రాబడికి గండి ఇలా..!
ఈ జీరో దందాతో మార్కెట్ కు రావలసిన రాబడి గంటకు వేలల్లో, రోజుకు లక్షల్లో గండి పడుతున్నట్లు అవగతమవుతోంది. వాస్తవానికి ఖరీదుదారు కొనుగోలు చేసిన సరకులు క్వింటాకు ఆరోజు నిర్ణయించబడిన ధరపై ఒక (1%) శాతము మార్కెట్ కు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 5%(ఐదు శాతం) జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. వెయ్యి బస్తాల సరుకు 500 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే, ఆ రోజు ధర 18000 పలికితే మార్కెట్ నిబంధనల ప్రకారం 1%శాతం ప్రకారం.. 9వేల రూపాయల వరకు ఖరీదుదారుడు మార్కెట్ కు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 5% జీఎస్టీ 45 వేల రూపాయలు చెల్లించాలి. అయితే ఈ మొత్తాన్ని చెల్లించకుండా ఖరీదుదారులు, అధికారులు కుమ్మక్కై మార్కెట్ ఆదాయానికి గండి కొడుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన సరుకుకు అసలు రశీదు కాకుండా కేవలం తెల్లకాగితం మీద బస్తాలు, తూకం వివరాలు నమోదు చేస్తున్నట్లు రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.
అంతా ఆ సారే !
ఈ జీరో దందా మార్కెట్ కార్యదర్శి రాహుల్ కనుసన్నల్లోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దొంగ లెక్కల్లో కార్యదర్శికి ఒక్కో బస్తాకు రూ.10 చొప్పున, దడువాయికి రూ.5 చొప్పున ఖరీదుదారు చెల్లిస్తున్నట్లు పలువురు వ్యాపారులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ లెక్కన ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్ కు రోజుకు ఎన్ని వేల బస్తాల సరుకు వస్తుందో, ఎన్ని వేల క్వింటాళ్ల సరుకు జీరోగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా రసీదుల్లేకుండానే వ్యాపారం సాగిస్తూ మార్కెట్ ఆదాయాన్ని కమాల్ చేస్తున్న ఈ ఆజీరో దందా అంతా మార్కెట్ కార్యదర్శి రాహుల్ కనుసన్నల్లోనే జరుగుతున్నదని కొందరు వ్యాపారులు, అడ్తిదారులు పేర్కొనడం గమనార్హం.
తెలుగు రాదా ? తెల్లారుత లేదా ?
మార్కెట్ లో రోజుకు లక్షల రూపాయలు గోల్ మాల్ అవుతున్నాయని అక్షర సాక్షిగా బహిర్గతమైన ఉన్నతాధికారులు స్పందించక పోవడం విస్మయం కలిగిస్తోంది. అసలు వారికి తెలుగు అర్థమవుతోందా ? లేదా మొద్దు నిద్రలో ఉండి ... ఇంకా తెల్లవారడం లేదనుకుంటున్నారా..? అంటూ రైతులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మొద్దు నిద్ర వీడి మార్కెట్లో జరుగుతున్న జీరో దందా, ఇతర అక్రమాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.