దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియెషన్ నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న సహ-వ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ తన బాధ్యతలకు రాజీనామా చేశారు. తక్షణమే బోర్డు నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇంటర్‌గ్లోబ్‌లో వచ్చే ఐదేళ్లలో తన వాటాను క్రమంగా తగ్గించుకోనున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాకేష్ గంగ్వాల్‌కు సంస్థలో 14.65 శాతం, ఆయన భార్యకు 8.39 శాతం వాటాలు ఉన్నాయి. '15 ఏళ్లకు పైగా కంపెనీలో దీర్ఘకాలిక వాటాదారుగా ఉన్నాను. ఇన్నేళ్ల తర్వాత నా వాటాను తగ్గించుకోవడం సహజమైన చర్యగా భావిస్తున్నాం. దీనికోసం రాబోయే ఐదేళ్లలో నెమ్మదిగా నా ఈక్విటీ వాటాను తగ్గించుకోవాలని భావిస్తున్నాను. దీనివల్ల కొత్త ఇన్వెస్టర్లకు ప్రయోజనాలు ఉంటాయని' ఆయన లేఖలో వివరించారు.