'లేచిపోయిన మైనర్' అమ్మాయి కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు!
వివాహానికి ఒక నిర్థిష్ట వయసు మాత్రం ఉంటుంది. Supreme Court Explains the Section 366 IPC in Runaway Marriages Case.
దిశ, వెబ్‌డెస్క్ః ప్రేమ పెళ్లిళ్ల విషయంలో విభిన్న వాదనలున్నాయి. సామాజిక అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్ట ప్రకారం, పరస్పర ఇష్టంతో ఎవరు ఎవరినైనా పెళ్లిచేసుకోవచ్చు. అయితే, వివాహానికి ఒక నిర్థిష్ట వయసు మాత్రం ఉంటుంది. మైనారిటీ తీరకుండా పెళ్లి చేసుకోవడానికి చట్టం అనుమతించదు కూడా. అయితే, ఓ మైనర్ బాలిక ప్రేమ వివాహానికి సంబంధించి 'ఐపీసీ సెక్షన్ 366'పై తాజాగా సుప్రీం కోర్టు కీలక విషయాన్ని వెల్లడించింది. బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడు, అలాగే, కిడ్నాప్ చేయడం ద్వారా లేదా మహిళను ప్రేరేపించడం ద్వారా మాత్రమే ఐపిసి సెక్షన్ 366 కింద నేరం వర్తిస్తుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఇది, ఒక నిర్థిష్ట కేసుకు సంబంధించిన తీర్పు అయినప్పటికీ దీని ప్రభావం మైనర్ బాలికల ప్రేమ వివాహాలపై తీవ్రంగా పడనున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఓ ప్రేమికుల జంట 2005 సంవత్సరంలో తమ కుటుంబాలను విడిచిపెట్టి, వెళ్లారు. ఆ తర్వాత, 25.12.2006 న వివాహం చేసుకున్నారు. అయితే, ఆమె ఇంటిని విడిచిపెట్టిన సమయంలో మైనర్ అని, అపహరణకు గురైందని, మోసం చేసి ఆమెను కిడ్నాప్ చేశారని ఆమె తండ్రి పేర్కొన్నాడు. దీనిపై న్యాయం కోరుతూ, తాము ఒకరినొకరం ఇష్టపడి వివాహం చేసుకున్నామని, మైనర్ అయినప్పటికీ మోసం చేసి కిడ్నాప్ చేయలేదని పిటీషనర్ రాజస్థాన్ హైకోర్టులో పిటీషన్ వేయగా, కోర్టు దాన్ని కొట్టేసింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలపై పిటిషనర్‌పై ఐపీసీ 363, 366 సెక్షన్ల కింద అభియోగపత్రం నమోదు చేశారు.
ఆ తర్వాత పిటీషనర్ తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తమకు డిసెంబర్ 2006 నుంచి వివాహమైందని, అప్పటి నుంచి సంతోషంగా సహజీవనం సాగిస్తున్నామని అప్పీలుదారులు కోర్టులో వెల్లడించారు. ప్రస్తుతం, వీళ్లద్దిరికీ 8 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ కేసును పరిశీలించిన ఎస్ అబ్దుల్ నజీర్, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం అప్పీల్‌ను అనుమతిస్తూ, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేసింది.
"సెక్షన్ 363 IPC ప్రకారం నేరానికి పాల్పడిన వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్‌ను ప్రలోభపెట్టడం లేదా తీసుకెళ్లడం చేయకూడదు. ప్రస్తుత కేసులో, అపహరణకు గురైన వ్యక్తి తనను తీసుకెళ్లలేదని లేదా ప్రేరేపించలేదని, ఆమె తన స్వంత ఇష్టానుసారం తన ఇంటిని విడిచిపెట్టిందని స్పష్టంగా పేర్కొంది. స్త్రీని కిడ్నాప్ చేయడం లేదా ప్రేరేపించడం ద్వారా బలవంతంగా వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే సెక్షన్ 366 IPC అమలులోకి వస్తుందని" ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వెల్లడించింది.