చెన్నయ్: ఆన్‌లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందాకు నిరాశ ఎదురైంది. 16 ఏళ్ల ప్రజ్ఞానందా ఈ టోర్నీలో 8వ రౌండ్‌లో వరల్డ్ నం.1 చెస్ ప్లేయర్, ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ టోర్నీలో ప్రిలిమినరీ రౌండ్‌లోనే ప్రజ్ఞానందా ప్రయాణం ముగిసింది.
రౌండ్ రాబిన్ దశలో 11వ స్థానంలో నిలిచిన ప్రజ్ఞానందా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. 8వ రౌండ్ అనంతరం 9వ, 13వ రౌండ్లలో డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద..10వ, 12వ రౌండ్లో విజయం సాధించాడు. ఆఖరి 15వ రౌండ్‌లోనూ రష్యా గ్రాండ్‌మాస్టర్ వ్లాడిస్లావ్ ఆర్టెమివ్‌పై ప్రజ్ఞానందా గెలుపొందాడు. అయితే, మొత్తంగా ప్రిలిమినరీ రౌండ్‌లో అతను 19 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచాడు. టాప్-8లో నిలిచిన ప్లేయర్లు మాత్రమే నాకౌట్ దశకు చేరుకుంటారు.
ఈ టోర్నీలో 15 రౌండ్లలో ప్రజ్ఞానంద 5 విజయాలు, 4 డ్రాలు చేసుకోగా.. 6 రౌండ్లలో ఓడిపోయాడు. వరల్డ్ నం.1 కార్ల్‌సన్(నార్వే)తోపాటు టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న లెవ్ అరోనియన్(అమెరికా), ఆండ్రీ ఎసిపెంకో(రష్యా), అలెగ్జాండ్రా కోస్టెనియుక్(రష్యా), కీమర్(జర్మనీ)లను ప్రజ్ఞానందా ఓడించడం విశేషం.