కోల్‌కతా: క్రికెట్ అభిమానులకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు (క్యాబ్) బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 16వ తేదిన ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే వెస్టిండీస్ వర్సెస్ ఇండియా తొలి టీ20 మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. ఈ విషయమై బెంగాల్ క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ)కు విజ్ఞప్తి చేసింది. కొవిడ్ వ్యాప్తి కారణంగానే తొలి టీ20ని ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని క్యాబ్ చేసిన విజ్ఞప్తిపై స్పందించిన బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గడచిన గురువారం దీనికి సంబంధించి క్యాబ్ బీసీసీఐకి లేఖ రాయగా సానుకూలంగా సమాధానం వచ్చినట్టు బెంగాల్ బోర్డు సోమవారం ప్రకటించింది.
భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టుతో ఇండియా మూడు టీ20లను ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది. అయితే, తొలి మ్యాచ్ మినహా మిగతా చివరి రెండు మ్యాచులకు ప్రేక్షుకులను అనుమతించాలని క్యాబ్ బీసీసీఐని కోరింది. తొలి మ్యాచ్ కోసం స్పాన్సర్‌లు, ప్రతినిధుల కోసం ఎగువ శ్రేణి, హాస్పిటాలిటీ బాక్సులను మాత్రమే అనుమతించింది. ఇదిలాఉండగా అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
మరోసారి సుందర్ ఔట్..
వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే, టీ20 మ్యాచులకు ఎంపికైన వాషింగ్టన్ సుందర్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వన్డే మ్యాచులకు ఆడిన సుందర్ కండరాల నొప్పితో టీ20 మ్యాచులకు, శ్రీలంకతో జరిగే సిరీస్‌కు కూడా దూరం అయ్యాడు. అయితే, కేవలం వన్డేలకు మాత్రమే ఎంపికైన కుల్దీ్ప్ యాదవ్‌ను సుందర్ స్తానంలో భర్తీ చేయనున్నట్టు సమాచారం.