భారత్‌లో విస్తరణ కోసం 7,000 మందిని నియమించుకోనున్న ఐకియా!
బెంగళూరు: ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా భారత్‌లో విస్తరణను వేగవంతం చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది..Latest Telugu News
బెంగళూరు: ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా భారత్‌లో విస్తరణను వేగవంతం చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. గత రెండేళ్లలో కొత్త స్టోర్లను తెరిచిన ఐకియా, తాజాగా బెంగళూరులో తన నాలుగో ఔట్‌లెట్‌ను బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు త్వరలో కనీసం మూడు నాలుగు అతిపెద్ద స్టోర్లను భారత్‌లో తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 2018 ఏడాది మొదటిసారి హైదరాబాద్‌లో తన మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ఐకియా, ఆ తర్వాత రెండేళ్లకు 2020లో నవీ ముంబైలో రెండో స్టోర్, అదే ఏడాది ముంబైలో మరో చిన్న స్టోర్‌ను ప్రారంభించింది.
బుధవారం బెంగళూరులో నాలుగో ఔట్‌లెట్ ద్వారా కంపెనీ ప్రస్తుతం భారత్‌లో 4.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద స్టోర్‌ను కలిగి ఉన్నట్టు తెలిపింది. ఈ కొత్త స్టోర్ కోసం ఐకియా దాదాపు వెయ్యి మందిని నియమించుకున్నట్టు, వారిలో 70 శాతం మంది స్థానికులను తీసుకున్నట్టు ఐకియా ఇండియా ఎగ్జిక్యూటివ్ పరిణీత సిసిల్ లక్రా చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐకియా 3 వేల మంది ఉద్యోగులను కలిగి ఉందని, రానున్న రోజుల్లో మరో 7,000 మందిని తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. త్వరలో మరో రెండు స్టోర్లను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలో ఇంకా ఖరారు కాలేదని ఐకియా ఇండియా హోమ్ ఫర్నిషింగ్, డిజైన్ మేనేజర్ ఎరిక్ జాన్ వెల్లడించారు.