బీజేపీ సభ్యులను ఎలా సస్పెండ్​ చేస్తారు : రేవంత్ రెడ్డి ఫైర్

రాష్ట్ర శాసనసభ నిర్వహణ నిబంధనలకు భిన్నంగా సాగుతుందని, బడ్జెట్​ ప్రవేశపెట్టినప్పుడు సభ్యులపై చర్యలు ఉండవని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు.

Update: 2022-03-07 15:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర శాసనసభ నిర్వహణ నిబంధనలకు భిన్నంగా సాగుతుందని, బడ్జెట్​ ప్రవేశపెట్టినప్పుడు సభ్యులపై చర్యలు ఉండవని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. సభలో సభ్యులపై ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటూ బీఏసీలో చర్చించి, నిర్ణయం తీసుకున్న తర్వాతే చర్యలు తీసుకోవాలని, అలాంటివేమీ పట్టించుకోకుండా సభ్యులను ఎలా సస్పెండ్​ చేస్తారని ప్రశ్నించారు. గాంధీభవన్​లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడారు. బడ్జెట్​ సమావేశాలు పూర్తిగా వ్యతిరేకంగా సాగుతున్నాయని, ఎలాంటి చర్చ లేకుండా బీజేపీ సభ్యులను ఎలా సస్పెండ్​ చేస్తారన్నారు. సిద్ధాంతపరంగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తామని, కానీ సోమవారం నిబంధనలకు భిన్నంగా ఎలాంటి చర్చ చేయకుండానే సస్పెండ్​ చేయడాన్ని కాంగ్రెస్​ పక్షాన ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను కుదించారని, గతంలో 30 రోజులు జరిగేవని గుర్తు చేశారు.

సభలో సీఎం కేసీఆర్ సైగ చేయగానే.. స్పీకర్ ఆదేశాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. సభా నిర్వహణపై మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, స్పీకర్ తీరుకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో మంగళవారం ఉదయం 11 గంటలకు అంబేడ్కర్ విగ్రహాల పద్ద నల్ల రిబ్బన్లు మూతికి కట్టుకొని నిరసన తెలియజేస్తామని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిన విధానం చూస్తుంటే విద్యార్థుల నుంచి ఉద్యమకారుల వరకు అందరినీ అవమానించేలా ఉందని విమర్శించారు. తొలి, మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 1500 కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కేవలం 500 కుటుంబాలకు మాత్రమే సాయం అందించారని వెల్లడించారు. ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితుల్లో నిరుద్యోగులకు రూ. 3016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, బడ్జెట్​లో ఒక్కపైసా కేటాయించలేదన్నారు. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్​.. సీఎం కేసీఆర్ కు చివరి బడ్జెట్ అని రేవంత్​రెడ్డి మండిపడ్డారు.

వాస్తవానికి దూరంగా బడ్జెట్​ : భట్టి

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త పథకాలు తెచ్చామని చెబుతున్నారని, గతేడాది బడ్జెట్ కూడా పెట్టిన దానికి చేసిన ఖర్చు కు పొంతన లేదని, కేటాయింపులు కేవలం చెప్పుకోవడం కోసమేనని దుయ్యబట్టారు. ఎన్నికల సందర్భంగా జాగా ఉంటే ఇళ్లు కట్టుకోవడం కోసం 5 లక్షలు అని చెప్పి.. ఇప్పుడు 3 లక్షలు మాత్రమే పెట్టారని, నిరుద్యోగులు, రైతులు ఇలా ఏ వర్గానికి ఉపయోగపడని బడ్జెట్ ఇదని విచారం వ్యక్తం చేశారు. ప్రచారానికి తప్ప ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ కాదని, ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని, రాష్ట్రాన్ని తెచ్చుకొన్నది తలెత్తుకొని బతకడం కోసమని, కానీ సెల్ప్ రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారని భట్టి ఫైర్ అయ్యారు. గవర్నర్‌తో మీకు వ్యక్తిగత తగాదాలు ఉంటే వేరే విధంగా చూసుకోవాలని, గతేడాది జరిగిన పురోగతి చెప్పాల్సి ఉన్నా చెప్పలేదని భట్టి ధ్వజమెత్తారు.

Tags:    

Similar News