ప్రథమార్థంలో 60 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో దేశవ్యాప్తంగా ప్రధాన ఎనిమిది నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పుంజుకున్నాయి.
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో దేశవ్యాప్తంగా ప్రధాన ఎనిమిది నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పుంజుకున్నాయి. జనవరి-జూన్ మధ్య ప్రధాన నగరాల్లో గతేడాది కంటే 60 శాతం వృద్ధితో మొత్తం 1,58,705 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇది గత తొమ్మిదేళ్లలోనే అత్యధిక డిమాండ్ అని, తక్కువ బేస్ ఎఫెక్ట్, తక్కువ వడ్డీ రేట్ల కారణంగా గిరాకీ మెరుగ్గా ఉందని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. 'ఇండియా రియల్ ఎస్టేట్; రెసిడెన్షియల్, ఆఫీస్ మార్కెట్-హెచ్1 2022' పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, 2021, మొదటి ఆరు నెలల కాలంలో ఇళ్ల అమ్మకాలు 99,416 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2013 ప్రథమార్థంలో మొత్తం 1,85,577 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇళ్లను కొనుగోలుదారుల జీవనశైలిలో మార్పులు రావడం, గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు ఉండటం, కరోనా ముందుతో పోలిస్తే తక్కువ ధరలో ఇళ్లు లభించడం వంటి అంశాలు మొత్తం గృహ అమ్మకాల వృద్ధికి సహాయపడ్డాయి.
కరోనా ప్రభావం వల్ల సొంత ఇంటి అవసరాన్ని వినియోగదారులు గుర్తించడం కూడా అమ్మకాలు పెరిగేందుకు దోహదపడిందని నివేదిక అభిప్రాయపడింది. హౌసింగ్ ధరలకు సంబంధించి గతేడాది కంటే ఈసారి 39 శాతం పరిధిలో పెరిగాయి. ఇది 2015 ద్వితీయార్థం నాటి స్థాయికి చేరుకుంది. నగరాల వారీగా చూస్తే ఆర్థిక రాజధాని ముంబైలో 55 శాతం పెరిగి 44,200 యూనిట్లు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 29,101 యూనిట్లతో రెండింతలు, బెంగళూరులో 80 శాతం పెరిగి 26,677 యూనిట్లుగా నమోదయ్యాయి. పూణెలో 25 శాతంతో 21,797 యూనిట్లు, చెన్నైలో 21 శాతం పెరిగి 6,951 యూనిట్లకు పెరిగాయి. హైదరాబాద్‌లో 23 శాతం పెరిగి 14,693 యూనిట్లు, కోల్‌కతాలో 39 శాతం వృద్ధితో 7.090 యూనిట్లు, అహ్మదాబాద్‌లో 95 శాతం పెరిగి 8,197 యూనిట్లు అమ్ముడయ్యాయి.