ఆ సమస్యతో అటకెక్కిన ఆసుపత్రి.. ఇబ్బందులు పడుతున్న రోగులు

Update: 2022-04-03 10:27 GMT

దిశ, లక్షెట్టిపేట: లక్షెట్టిపేటకు వంద పడకల ఆసుపత్రి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. స్థల సమస్యే ప్రధాన కారణంగా ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు అటకెక్కినట్లు కనబడుతోంది. దానికి బదులుగా ప్రాంతీయ ఆసుపత్రి మంజూరుకు పరిమితం చేయడంతో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు లేనట్లేనని భావిస్తున్నారు.

స్థల సమస్య..

ఐదేళ్ల కిందట లక్షెట్టిపేట పట్టణానికి వంద పడకల ఆసుపత్రి మంజూరైంది. రూ.2 కోట్ల ప్రభుత్వ నిధులతో దీన్ని నిర్మించ తలపెట్టారు. కాగా, దీనికి స్థల సమస్య వచ్చి పడింది. ఈ ఆసుపత్రి నిర్మాణానికి కనీసంగా రెండెకరాల విస్తీర్ణ స్థలం ఉండాలి. ముందుగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాత తహసీల్దార్ క్వార్టర్ ఆవరణ స్థలాన్ని వంద పడకల ఆసుపత్రికి కేటాయించేందుకు పరిశీలించారు. ఈ స్థల ఎంపిక పై స్థానిక, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు అంతర్గతంగా వర్గాలుగా విడిపోవడం ద్వారా భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. వంద పడకల ఆస్పత్రికి పాల శీతలీకరణ కేంద్ర స్థలాన్ని కొందరు నాయకులు సూచించగా, మరి కొందరు పాత తహసీల్దార్ క్వార్టర్ ఆవరణ స్థలాన్ని తప్పితే, నీటిపారుదల కార్యాలయ స్థలం ఆసుపత్రి నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని సూచించారు.

ఈ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఆరోగ్య శాఖ అధికారులు ఆ స్థలాలు అన్నింటిని పరిశీలించారు. ఈ క్రమంలో మేజర్ పంచాయతీ నుంచి లక్షెట్టిపేట కొత్త మున్సిపాలిటీ గా మారడం, శాసనసభ, పార్లమెంటరీ, స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఆ ఆసుపత్రి ఏర్పాటు ఊసే లేకుండా పోయింది. ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ఆస్పత్రి స్థానంలో స్థాయిని పెంచుతూ ప్రాంతీయ ఆసుపత్రి( ఏరియా హాస్పిటల్) మంజూరైంది.

దానికి సంబంధించిన బోర్డును సైతం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేశారు. దీనికితోడు గత నెలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంచిర్యాల్ లో మెడికల్ కాలేజీని, మాత శిశు సంరక్షణ కేంద్ర ఆసుపత్రిని ప్రారంభించడంతో ఇక్కడ వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు పై ఆశలు సన్నగిల్లాయి. ఇక 30 పడకల తో ప్రాంతీయ ఆసుపత్రి మంజూరు తోనే లక్షెట్టిపేట ను పరిమితం చేసినట్లయింది.


స్పెషలిస్ట్ డాక్టర్లేరి?

సిహెచ్‌సి ఆసుపత్రి స్థానంలో ప్రాంతీయ ఆసుపత్రిని గత యేడాది సెప్టెంబర్ లో మంజూరు చేశారు. దానికి తగ్గ స్పెషలిస్ట్ డాక్టర్ లు ఇంకా భర్తీ కాలేదు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, పీడియాట్రిక్, సర్జన్ తదితర అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సేవలను విస్తరించాలి. కానీ, ఈ ఆస్పత్రిలో గతంలో సి హెచ్‌సి లో పనిచేసిన ఎంబిబిఎస్ డాక్టర్ల ద్వారానే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

అది కూడా ఒక రెగ్యులర్ ఇద్దరు డిప్యుటేషన్ వైద్యుల ద్వారా ఆసుపత్రిని నడిపిస్తున్నారు. కుందారం పీహెచ్‌సీ వైధ్యాధికారిగా ఉన్న డాక్టర్ డిప్యుటేషన్ పై ఈ ఆస్పత్రికి ఇంచార్జి వైధ్యాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ వైద్యాధికారి సైతం వృత్తిరీత్యా సెలవు పెట్టే యత్నంలో ఉండటంతో ఇద్దరు డాక్టర్ల ద్వారా ఆస్పత్రిలో వైద్య సేవలు అందడం కష్టంగా మారే అవకాశం ఉంది.

సేవలు నాస్తి..

గతంలో 30 పడకల గా ఉన్న సీహెచ్‌సీ ఆస్పత్రిలో ఆరుగురు ఎంబిబిఎస్ డాక్టర్ల ద్వారా వైద్య సేవలు కొనసాగాయి. అందులో ఐదుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఒక డెంటల్ డాక్టర్ ద్వారా రోగులకు అందుబాటులో ఉండేవారు. ప్రస్తుతం ఒక రెగ్యులర్, ఇద్దరు డిప్యూటేషన్ డాక్టర్లు మాత్రమే ఉండటంతో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నారు. సిహెచ్‌సిలో కంటి పరీక్షలతో సేవలందించిన ఆప్తాల్మిక్ జోనల్ విధానంలో బదిలీపై వెళ్లారు. కంటి పరీక్షలు చేసుకునే ఈ ప్రాంత పేదలకు మంచిర్యాల ఆస్పత్రులకు వెళ్లాల్సి రావడంతో ఆర్థిక భారం పడుతోంది. ఈ ఆస్పత్రి లక్సెట్టిపేట మండల ప్రజలకే కాకుండా దండేపల్లి, జన్నారం మండలాలకు పెద్ద ఆసుపత్రి.

ఆ మండలాల నుంచి అత్యవసర చికిత్సలకు, వైద్య పరీక్షలకు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. ఆస్పత్రిలో స్కానింగ్ మిషన్ ఉన్నా రేడియాలజిస్ట్ లేరు. సాధారణ డెలివరీ కి అత్యవసర స్కానింగ్ అవసరం పడితే రేడియాలజిస్ట్ లేక మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి పంపించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. సీహెచ్‌సీకి అనుసంధానంగా ఉన్న పలు గదులు శిథిలావస్థకు చేరి వర్షాలకు పైకప్పు పెచ్చులూడి కింద పడుతున్నాయి. ఆ గదులను వైద్య పరీక్ష సేవలకు వినియోగించడం లేదు.

ఇక్కడికి వచ్చే రోగుల రద్దీకి అనుగుణంగా చికిత్సలు, పరీక్షలకు ఆస్పత్రిలో సరైన భవన సదుపాయాలు, సౌకర్యాలు లేవు. లక్షెట్టిపేటలో ప్రాంతీయ ఆసుపత్రి విషయమై మంచిర్యాల జిల్లా హెల్త్ సర్వీస్ కోఆర్డినేటర్ డాక్టర్ అరవింద్ ను దిశ సంప్రదించగా లక్షెట్టిపేట లో ప్రాంతీయ ఆసుపత్రి ఏర్పాటు విషయంలో అధికారిక ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. అవి రాగానే ఆస్పత్రిలో అన్ని సమకూరుతాయని అన్నారు.

Tags:    

Similar News