దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. తాజాగా ఈ సంస్థ తన భవిష్యత్తు ఎలక్ట్రిక్, కొత్త జనరేషన్ వాహన ఉత్పత్తుల కోసం కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. 'వీదా' పేరుతో తీసుకొచ్చిన కొత్త బ్రాండింగ్‌ను సంస్థ చైర్మన్ బ్రిజ్‌మోహన్‌లాల్ ముంజాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఏడాది జూలై 1న మొదటి ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేయనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న తయారీ ప్లాంట్‌లో మొదటి ఈవీ మోడల్‌ను ఉత్పత్తి చేసి, ఈ ఏడాది ఆఖర్లో వినియోగదారులకు డెలివరీ చేయనున్నట్లు కంపెనీ వివరించింది.ఈ సందర్భంగా మాట్లాడిన సంస్థ చైర్మన్, సీఈఓ పవన్ ముంజల్.. వీదా బ్రాండ్ కోసం 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 761 కోట్ల)తో గ్లోబల్ సస్టైనబులిటీ ఫండ్‌ను ప్రకటించారు.
ఈ నిధుల ద్వారా అంతర్జాతీయంగా కొత్త బ్రాండ్‌ను పటిష్టం చేయడానికి వివిధ భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు వినియోగించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మొత్తం 10 వేల మంది ఆంటర్‌ప్రెన్యూర్‌లను ప్రోత్సహించే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త బ్రాండ్ గురించి వివరించిన పవన్ ముంజాల్ 'వీదా' అంటే జీవితం. ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం ఈ బ్రాండ్ ముఖ్య ఉద్దేశ్యమని, మెరుగైన మార్గంలో ముందుకెళ్లడమని చెప్పారు. ఇది ప్రస్తుతం తరంతో పాటు రాబోయే తరాలను సూచించే పేరుగా భావిస్తున్నామని వెల్లడించారు.