తెలంగాణ గుండె కాయను కేంద్రం అమ్మాలని చూస్తోంది: హరీష్ రావు

Update: 2022-03-04 12:39 GMT

దిశ, బెల్లంపల్లి: దక్షిణ భారతదేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా అమ్మాలని చూస్తోందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బెల్లంపల్లిలో రూ. 94 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు బహిరంగ సభలో ప్రసంగించారు. లాభాల్లో నడుస్తున్న సింగరేణి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు అప్పగించడానికి నిర్ణయించుకుందని విమర్శించారు. తెలంగాణకు గుండె కాయ, ప్రధాన ఉపాధి కేంద్రమైన సింగరేణి నాశనం చేయడానికి ప్రధానమంత్రి మోడీ కంకణం కట్టుకున్నాడు అని ధ్వజమెత్తారు. అందుకోసమే సింగరేణిలో బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నారని పేర్కొన్నారు.

సింగరేణి అభివృద్ధిని అసలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో మాదిరిగా స్కీములు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే తెలంగాణను అభివృద్ధికి దిక్సూచిగా నిలబెట్టారని అన్నారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణ మించిన రాష్ట్రం లేదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10 లక్షల 30 వేల నూట పెళ్లిళ్లకు రూ. 9 వేల కోట్లు కళ్యాణ్ లక్ష్మి కింద అందజేశామని అన్నారు. తెలంగాణ రాక ముందు సమైక్యాంధ్ర పాలనలో మూడు మెడికల్ కళాశాలలు ఉండగా అవి నేడు తెలంగాణలో 17కు చేరాయి అని పేర్కొన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యున్నతమైన సదుపాయాలను కల్పిస్తామని అన్నారు.

Tags:    

Similar News