Leander Paes:టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌పై యానిమేటెడ్ 'షో'
దిశ, శేరిలింగంపల్లి: చోటా భీమ్ యానిమేటెడ్ షోతో - Green Gold Animation announces animation series based on Leander Paes
దిశ, శేరిలింగంపల్లి: చోటా భీమ్ యానిమేటెడ్ షోతో అశేష ప్రేక్షకాదరణ పొందిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈసారి మరో భారీ ప్రాజెక్ట్ తో ముందుకు వస్తోంది. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ జీవిత చరిత్రను యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు సీఈవో రాజీవ్ చిలక, హీరోయిన్ కిమ్ శర్మతో కలిసి లియాండర్ పేస్ మీడియాకు వెల్లడించారు. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన యానిమేషన్ సిరీస్ చోటా బీమ్ 14 ఏళ్లుగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇదే క్రమంలో లియాండర్ పేస్ అతని జీవిత కథపై యానిమేషన్ సిరీస్ చేయనుంది.
ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ యానిమేషన్ సిరీస్ కు లిటిల్ లియాండర్ గా నామకరణం చేశారు. ఇందులో లియాండర్ జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు, గ్రేటెస్ట్ టెన్నిస్ స్టార్ లో ఒకరిగా, గ్లోబల్ ఐకాన్ గా మారే ప్రయాణంలో అతని చిన్ననాటి అనుభవాలను ఇందులో పొందుపరిచారు. ఎనిమిది కెరీర్ గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్, కెరీర్ గ్రాండ్ స్లామ్ మిక్సిడ్ డబుల్స్ ఛాంపియన్ లతో టెన్నిస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరిగా పేరుపొందారు. పిల్లలను, యువకులను దృష్టిలో ఉంచుకుని ఈ యానిమేషన్ షో రూపొందించనున్నారు.
గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ రాజీవ్ చిలక ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిస్టర్ లియాండర్ పేస్ తో కలిసి పని చేయడం మాకు నిజంగా గౌరవంగా ఉందని, లియాండర్ పేస్ గా మారడం అంత సులభం కాదని అన్నారు. టెన్నిస్ కోర్టులో వెలుపల లియాండర్ పేస్ వారసత్వాన్ని కొనసాగించడానికి నేటి తరానికి స్ఫూర్తి నిచ్చే గ్లోబల్ ఐపీని మేం సృష్టించగలమని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కిమ్ శర్మ, శ్రీని, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.