ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం.. అగ్రిమెంట్ టెండర్లు వైరల్
దిశ ప్రతినిధి, కరీంనగర్: అక్కడ ప్రత్యామ్నాయ ప్రభుత్వం సాగుతోందా..? సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారా..
దిశ ప్రతినిధి, కరీంనగర్: అక్కడ ప్రత్యామ్నాయ ప్రభుత్వం సాగుతోందా..? సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారా..? ఇందుకు అవసరమైన అగ్రిమెంట్లు కూడా వారే చేస్తున్నారా? అంటే నెట్టింట వైరల్ అవుతున్న ఈ లేఖను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోని కారణంగానే ఈ వసూళ్ల దందాకు తెరలేపారన్న ఆరోపణలు వస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు చేయాల్సిన పని, ఇరిగేషన్ విభాగం ఇవ్వాల్సిన అనుమతులు, రెవెన్యూ అధికారుల జరపాల్సిన భూ సేకరణలతో సంబంధం లేకుండానే రెండు గ్రామ పంచాయతీలే నిర్భయంగా అనుమతులు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.
వైరల్ అవుతున్న అగ్రిమెంట్..
పెద్దపల్లి జిల్లా ఓడెడ్, భూపలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి గ్రామాల మధ్యన ప్రవహిస్తున్న మానేరు నదిలో తాత్కాలిక రోడ్డు వేసి టోల్ వసూళ్లు చేసుకుంటున్న తీరుపై ఇప్పటికే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా.. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఓ అగ్రిమెంట్ పేపర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 2021 డిసెంబర్ 23న జరిగిన ఈ ఒప్పంద పత్రం ప్రకారం ఓడెడ్, గర్మిళ్లపల్లి గ్రామ పంచాయితీలు రూ. 22 లక్షల 20 వేలకు టెండర్ ద్వారా ఎర్రవెల్లి పాపారావు అనే వ్యక్తికి మానేరు నదిలో రోడ్డు వేసేందుకు అనుమతించామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుండి మార్చి 30లోగా మూడు విడుతలుగా టెండర్ సొమ్మును చెల్లించే విధంగా రాసుకున్న ఈ ఒప్పంద పత్రం ఇరు గ్రామ పంచాయితీ ప్రజల సమక్షంలోనే జరిగిందని కూడా అందులో స్పష్టంగా రాయడం గమానార్హం. అంతేకాకుండా ఓడెడ్, గర్మిళ్ళపల్లి పంచాయితీల పరిధిలో వచ్చే తగాదాలను సంబంధిత సర్పంచులే చూసుకోవాలని కూడా రాయించారు. వాహనాలను బట్టి టోల్ వసూలు చేయాల్సిన ధరలను కూడా ఇందులో రాసుకున్నారు. ఇసుక లారీలకు, లోడు బండ్లకు ఈ రోడ్డు మార్గం గుండా అనుమతి కూడా లేదని నోట్ కూడా పెట్టారు. ఈ ఒప్పంద పత్రంలో ఇరు పంచాయతీల సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా సంతాకాలు చేసినట్టుగా ఉంది. టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమంగా వసూలు చేస్తున్న రుసుంకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పంచాయితీల ప్రతినిధులే అగ్రిమెంట్లు రాసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సంబంధిత శాఖల అధికారులు కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడం విస్మయం కలుగుతోంది.
చట్టం... చుట్టమా... ?
పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడుతూ ఏకంగా ఒప్పంద పత్రాలు రాసి ఇచ్చిన తీరు చట్టాల ఉల్లంఘనే అవుతుందని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మనేరులో రోడ్డు వేసుకుని టోల్ వసూళ్లు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చే అధికారం పంచాయతీలకు ఉండదని తెలుస్తోంది. పంచాయతీలకు ఉన్న అధికారాలు ఏమిటీ, సంబంధం లేని శాఖలకు చెందిన పనులు కూడా అవే చేసుకోవడం వెనుక ఆంతర్యమేంటి అన్నదే అంతుచిక్కకుండా పోయింది. అసలు మానేరులో రోడ్డు వేసేందుకు ఏ శాఖ అనుమతి ఇవ్వాలి, మానేరు నదికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇరిగేషన్ అధికారుల క్లియరెన్స్ ఇవ్వడం వంటి విషయాలేవి ఇక్కడ అమలు కావడం లేదు. దీంతో పంచాయతీలే ప్రత్యామ్నాయ ప్రభుత్వాల్లా అనుమతులు ఇచ్చి అగ్రిమెంట్లు కూడా రాసివ్వడం ఏంటోనన్నదే మిస్టరీగా మారిందని అంటున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు..
ఓడెడ్, గర్మిళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న మానేరు నదిలో వేసిన తాత్కాలిక రోడ్డు నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రత్నం రమేష్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఆయన అక్రమంగా టోల్ వసూలు చేస్తున్నారని, ఈ వంతెన కారణంగా ఇసుక అక్రమ రవాణా కూడా జరుగుతోందని ఆరోపించారు. వాహనదారుల నుండి అధిక డబ్బులు వసూలు చేసి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ధనార్జనే ధ్యేయంగా టోల్ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని రత్నం రమేష్ ఆ ఫిర్యాదులో అభ్యర్థించారు.