దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రత్నాభరణాల రంగం స్వయం ఆధారిత పరిశ్రమగా పుంజు కోవాల్సిన అవసరం ఉందని భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో(ఐఐజేఎస్) సిగ్నేచర్-2022 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశీయ వృద్ధితో పాటు ఎగుమతుల ప్రమోషన్‌కు ఈ రంగం ఎంతో కీలకం.
బడ్జెట్-2022 లో సైతం కేంద్రం రత్నాభరణాల వ్యాపార వృద్ధికి, విస్తరణకు అవసరమైన నిర్ణయాలను తీసుకుంది. కట్, పాలిష్‌డ్ డైమండ్స్‌ప దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాం. ఎంఎస్ఎంఈలకు 2023, మార్చి వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ను పొడిగించాం. అంతేకాకుండా వ్యక్తిగత పూచీకత్తు బాండ్ల అంగీకారంతో సహా బడ్జెట్‌లో పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతిపాదనలను అమలు చేశామన్నారు.
రానున్న రోజుల్లో బంగారం దిగుమతికి బ్యాంక్ గ్యారెంటీ, ఈ-కామర్స్ ద్వారా ఎగుమతులను సులభతరం చేయడం వంటి నిర్ణయాలతో చిన్న వ్యాపారులకు మద్దతు ఉంటుందని, తద్వారా రత్నాభరణాల రంగం స్వయం ఆధారిత పరిశ్రమగా మారగలదని ఆయన వివరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది జనవరి 31 నాటికి రూ. 2.38 లక్షల కోట్లుగా ఉన్న ఈ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ. 3 లక్షల కోట్లకు చేరుకుంటుందని విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయ రత్నాభరణాల రంగం భారత జీడీపీ కి 7 శాతం సహకారం అందిస్తోందని, దాదాపు 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.